అదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం సకినాపూర్ గ్రామంలో మూఢనమ్మకాలు, బాల్యవివాహాలు, గుట్కా, మద్యపాన నివారణపై పోలీసు కళాబృందం ద్వారా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అదిలాబాద్ జిల్లా ఎస్పీ గౌస్ ఆలం ఆదేశాల ప్రకారం ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. కళాబృందం పాటలు పాడి, నాటికలు ప్రదర్శిస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా అదిలాబాద్ రూరల్ సీఐ ఫణిందర్ మాట్లాడుతూ, మూఢనమ్మకాల వల్ల సమాజంపై పడుతున్న ప్రభావాన్ని వివరించారు. గ్రామాల్లో గుడుంబా తయారీ నివారణ చర్యలు తీసుకోవాలని, యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని ప్రజలకు సూచించారు. యువతను మంచి మార్గంలో నడిపించడమే సమాజ అభివృద్ధికి ప్రధాన కర్తవ్యమని అన్నారు.
తలమడుగు ఎస్ఐ అంజమ్మ మాట్లాడుతూ, మహిళా సంఘాలు, యువత గుడుంబా నివారణలో భాగస్వామ్యం కావాలని తెలిపారు. చెడు అలవాట్లకు బానిస కాకుండా, సమాజంలో సకారాత్మక మార్పులు తీసుకురావడంలో ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యత నెరవేర్చాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ యువత, మహిళలు, గ్రామ సెక్రెటరీ, సర్పంచులు, పోలీసులు పాల్గొన్నారు. యువత మాట్లాడుతూ, గ్రామంలోని అధికారులు తమ పనులను క్రమంగా చేయాలని, గుడుంబా వంటి చెడు అలవాట్లకు పూర్తిగా దూరం కావాలని చెప్పారు. ఈ అవగాహన కార్యక్రమం గ్రామంలో మంచి మార్పుకు దారితీస్తుందని అందరూ విశ్వాసం వ్యక్తం చేశారు.