ప్రభుత్వ రంగ చమురు సంస్థలు వినియోగదారులకు స్వల్ప ఊరటనిచ్చాయి. హోటళ్లు, రెస్టారెంట్లు వంటివి ఉపయోగించే 19 కిలోల వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరను రూ.14.50 మేర తగ్గించినట్టు ప్రకటించాయి. అంతర్జాతీయ చమురు ధరల మార్పులకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపాయి.
ఇదే సమయంలో, విమానయాన రంగానికి ఉపయోగించే ఏటీఎఫ్ (ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్) ధరలను కూడా సంస్థలు సవరించాయి. తాజా తగ్గింపుతో ఢిల్లీలో కిలోలీటర్ ఏటీఎఫ్ ధర రూ. 3,954 మేర తగ్గి రూ. 85,486.80కి చేరింది. గత నెల కూడా ఏటీఎఫ్ ధర రూ. 5,870 మేర తగ్గించగా, ఇది వరుసగా రెండో నెల ధరల తగ్గుదల కావడం విశేషం.
కాగా, సామాన్య ప్రజలు వినియోగించే గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ల ధరలో ఎటువంటి మార్పు లేదని సంస్థలు స్పష్టం చేశాయి. 14.2 కిలోల గృహ వినియోగ సిలిండర్ ధర యథాతథంగా కొనసాగుతుంది. దీనివల్ల గృహ వినియోగదారులకు మాత్రం ఊరట లేదని స్పష్టం అయింది.
వాణిజ్య గ్యాస్, ఏటీఎఫ్ ధరల తగ్గింపుతో వ్యాపారరంగానికి, విమానయాన రంగానికి కొంత లాభం జరగనుంది. హోటల్స్, రెస్టారెంట్లు నిర్వహణ ఖర్చులు కొంత తగ్గుతుండగా, విమానయాన సంస్థలకు ఫ్యూయల్ ఖర్చులు తగ్గే అవకాశముంది. ఇది సేవల ధరలపై ప్రభావం చూపే అవకాశం కూడా ఉంది.
