టెక్ దిగ్గజం ఆపిల్ తన అభిమానులకు మళ్లీ ఓ మంచి వార్త అందించింది. కంపెనీ సరికొత్త ఐఫోన్ ఎస్ఈ 4ను మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 19న ఆపిల్ కొత్త ఉత్పత్తిని విడుదల చేయనున్నట్లు కంపెనీ సీఈవో టిమ్ కుక్ వెల్లడించారు. అయితే, ఆయన ఐఫోన్ ఎస్ఈ 4 పేరును ప్రత్యేకంగా ప్రస్తావించకపోయినా, లాంచ్ అవుతోన్న ప్రొడక్ట్ ఇదేనని టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఈ కొత్త ఐఫోన్ ఎస్ఈ 4 ధర కూడా తక్కువగా ఉండొచ్చని సమాచారం. దీని ద్వారా అధునాతన ఫీచర్లను తక్కువ ఖర్చుతో అందించాలనే ఆపిల్ యోచనలో ఉందని తెలుస్తోంది. ఐఫోన్ ఎస్ఈ మోడల్ సాధారణంగా మిడ్-రేంజ్ వినియోగదారులను టార్గెట్ చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎస్ఈ 4 మరింత ఆకర్షణీయమైన ధరతో లభించే అవకాశం ఉందని టెక్ విశ్లేషకులు చెబుతున్నారు.
ప్రతిసారి ఐఫోన్ కొత్త మోడల్ రిలీజ్ అవుతుందంటే, ఆపిల్ స్టోర్ల ఎదుట భారీగా హంగామా నెలకొనడం కామన్. అర్ధరాత్రి నుంచే గాడ్జెట్ ప్రియులు స్టోర్ల ముందు క్యూ కడతారు. ఈసారి కూడా అదే జరగనుందని, ప్రీ-ఆర్డర్ సమయంలోనే స్టాక్ తక్కువగా ఉండొచ్చని అంటున్నారు. వినియోగదారుల ఆశక్తి దృష్ట్యా, కంపెనీ భారీగా ఉత్పత్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఆపిల్ ఈ కొత్త మోడల్‌ను గత మోడళ్లకు భిన్నంగా డిజైన్ చేసినట్లు సమాచారం. ఎస్‌ఈ సిరీస్‌లో ఇప్పటివరకు ఉన్న డిజైన్ కంటే కొత్తగా ఉండేలా కంపెనీ మార్పులు చేసినట్లు టెక్ వర్గాలు చెబుతున్నాయి. అధికారికంగా ఎలాంటి స్పెసిఫికేషన్లు వెల్లడించకపోయినా, ఐఫోన్ ఎస్ఈ 4 విడుదల తర్వాత మార్కెట్‌లో దూసుకుపోవడం ఖాయమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.