రంజాన్ పవిత్ర నెల సందర్భంగా ఉపవాస దీక్షలో భాగంగా ప్రభుత్వ కార్యాలయాల నుండి ఒక గంట ముందుగా మసీదుకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ముస్లిం సమాజం కృతజ్ఞతలు తెలిపింది. ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు, మైనార్టీ మంత్రి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి లకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ నిర్ణయం ముస్లిం ఉద్యోగులకు ఉపవాస సమయాన్ని మరింత సౌకర్యవంతంగా మారుస్తుందని మైనార్టీ నేతలు తెలిపారు. ఉపవాస సమయంలో ఆధ్యాత్మికతకు ప్రాధాన్యం ఇచ్చేలా తీసుకున్న ఈ నిర్ణయం ముస్లిం సమాజానికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని అన్నారు. ముస్లిం మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో తెలుగు దేశం పార్టీ మైనార్టీ విభాగం నాయకులు, స్థానిక ముస్లిం పెద్దలు, ప్రముఖులు పాల్గొన్నారు. ప్రభుత్వ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తూ, సీఎం చంద్రబాబు నాయకత్వంలో మైనార్టీల హక్కులను మరింత ముందుకు తీసుకెళ్లాలని ఆశాభావం వ్యక్తం చేశారు.
శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ముస్లిం సమాజానికి మద్దతుగా ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని టీడీపీ నేతలు స్పష్టం చేశారు. రంజాన్ సందర్భంగా మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, ముస్లిం సోదరులు ఈ నిర్ణయాన్ని స్వాగతించారు.
