ఏపీ ఫైబర్ నెట్ లో తీవ్ర సంక్షోభం నెలకొంది. కూటమి ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలు అయినా ఫైబర్ నెట్ కు ఒక్క రూపాయి ఆదాయం రాలేదని సంస్థ చైర్మన్ జీవీ రెడ్డి విమర్శించారు. ఉన్నతాధికారులు సహకరించడం లేదని, విధుల్లో నిర్లక్ష్యం వహించిన ముగ్గురిని తొలగించినట్టు గురువారం ప్రకటించారు. ఫైబర్ నెట్ బిజినెస్ హెడ్ గంధంచెట్టు సురేష్, ప్రొక్యూర్మెంట్ అసిస్టెంట్ మేనేజర్ శశాంక్ హైదర్ ఖాన్, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ భరద్వాజలను తొలగించినట్టు తెలిపారు.
గత ప్రభుత్వంతో కుమ్మక్కై కొందరు ఉద్యోగులకు జీతాలు చెల్లించారని జీవీ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సంస్థలో సంస్కరణలు తీసుకురావడానికి 400 మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయం తీసుకున్నా, ఎండీ దినేశ్ కుమార్ సహా ఉన్నతాధికారులు సహకరించలేదని ఆరోపించారు. ఆయన నేరుగా ఆదేశాలు జారీ చేసినా, ఎవరూ పట్టించుకోలేదని మండిపడ్డారు. ఫైబర్ నెట్ పై రూ.377 కోట్లు జీఎస్టీ జరిమానా విధించినా, తన దృష్టికి తీసుకురాలేదని ఆరోపించారు.
ఈ తొమ్మిది నెలలుగా రాష్ట్రంలో ఒక్క కొత్త కనెక్షన్ కూడా ఇవ్వలేదని, సంస్థ పూర్తిగా నష్టాల్లో కూరుకుపోయిందని జీవీ రెడ్డి అన్నారు. ఎండీ దినేశ్ కుమార్ ఒక్క ఆపరేటర్ ను కూడా కలవలేదని, సిబ్బందికి టార్గెట్లు నిర్ధారించలేదని తెలిపారు. ఫైబర్ నెట్ సేవలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉన్నా, ఉన్నతాధికారుల నిర్లక్ష్యంతో సంస్థ దిగజారిందని ఆరోపించారు.
దినేశ్ కుమార్ గత ప్రభుత్వ పెద్దలతో కలిసి కుట్ర పన్నుతున్నారని, అందుకే కంపెనీని నష్టాల్లోకి నెట్టారని ఆరోపించారు. తొలగించిన ఉద్యోగులకు చెల్లించిన జీతాలను దినేశ్ కుమార్ సహా సంబంధిత ఉన్నతాధికారుల నుంచి వసూలు చేయాలని డిమాండ్ చేశారు. ఫైబర్ నెట్ పునరుద్ధరణకు తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ముందడుగు వేయాలని కోరారు.
