ఇప్పటి జీవనశైలి, ఉద్యోగ ఒత్తిళ్ల కారణంగా యాంగ్జైటీ, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలు ఎక్కువయ్యాయి. ముఖ్యంగా మహిళల్లో ఇవి అధికంగా కనిపిస్తున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. సమయానికి వీటిని పట్టించుకోకపోతే రక్తపోటు, డయాబెటిస్, ఒబెసిటీ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు దారితీసే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే, ప్రతిరోజు ఆహారంలో చిన్న మార్పులు చేస్తే యాంగ్జైటీ సమస్యను తగ్గించుకోవచ్చని వారు సూచిస్తున్నారు.
విటమిన్ D
ఈ విటమిన్ లోపం డిప్రెషన్, యాంగ్జైటీని పెంచుతుంది. పాలు, పెరుగు, పుట్టగొడుగులు, గుడ్డులో పచ్చసొన, చేపలు, మాంసం వంటి పదార్థాలను తరచుగా తీసుకోవాలి. ఇవి కార్టిసాల్ హార్మోన్ స్థాయులను తగ్గించి మానసిక ప్రశాంతతను కలిగిస్తాయి.
ఒమేగా–3 ఫ్యాటీ ఆమ్లాలు
సీ–ఫుడ్, వాల్‌నట్స్, అవిసె గింజలు, గుమ్మడికాయ గింజలు మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. ఇవి యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలతో కార్టిసాల్‌ను నియంత్రించి ఆందోళన తగ్గిస్తాయి.
పసుపు
పసుపులోని కర్క్యుమిన్ రసాయన పదార్థం మానసిక రుగ్మతలు, డిప్రెషన్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. అల్జీమర్స్, పార్కిన్సన్ వంటి వ్యాధుల తీవ్రతను కూడా తగ్గిస్తుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి.
జాగ్రత్తలు:
– ఆర్టిఫిషియల్ స్వీటెనర్స్‌ను అధికంగా వాడకండి. ఇవి “హ్యాపీ హార్మోన్ల” ఉత్పత్తిని అడ్డుకుని యాంగ్జైటీని పెంచుతాయి.
– గ్లూటెన్ అధికంగా ఉండే బ్రెడ్, బిస్కెట్లు, పాస్తా, బీర్ వంటి ప్రాసెస్డ్ ఫుడ్స్‌ను తగ్గించండి. వీటికి బదులుగా చిరుధాన్యాలు, ఓట్స్, రాగులను ఆహారంలో చేర్చుకోవాలి.
కీటో డైట్
కొంతమందికి యాంగ్జైటీ, డిప్రెషన్, ADHD వంటి సమస్యలను నియంత్రించడంలో కీటో డైట్ సహాయపడుతుంది. కానీ షుగర్, కిడ్నీ సంబంధిత సమస్యలున్నవారు తప్పనిసరిగా డాక్టర్ సలహా తీసుకోవాలి.
గమనిక:
ఇక్కడ ఇచ్చిన సమాచారం సాధారణ అవగాహన కోసం మాత్రమే. ఏ ఆహార మార్పులు చేయడానికి ముందు మీ వైద్యుడిని సంప్రదించడం అత్యవసరం.