ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు, నటుడు అనురాగ్ కశ్యప్ బాలీవుడ్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. సినీ పరిశ్రమ ఇప్పుడు పూర్తిగా వసూళ్లకు అనుగుణంగా మారిపోయిందని, క్రియేటివిటీకి విలువ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. గత కొంతకాలంగా బాలీవుడ్లో ఇమడలేక ఇబ్బంది పడుతున్నానని, అందుకే ఇక బాలీవుడ్ నుంచి పూర్తిగా వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు.
ప్రస్తుతం బాలీవుడ్లో సినిమాలను పూర్తిగా వ్యాపార దృష్టితోనే చూస్తున్నారని, సినిమా మొదలుపెట్టకముందే ఎంత వసూలవుతుందనే లెక్కలకే ప్రాధాన్యం ఇస్తున్నారని ఆయన విమర్శించారు. ఈ పరిస్థితుల్లో పనిచేయడం తనకు ఆసక్తిగా అనిపించడం లేదని, సినిమా నిర్మాణం తనకు సంతోషాన్ని కలిగించాలిగానీ, ఒత్తిడిని తీసుకురాకూడదని అన్నారు.
తన దృష్టిలో సినిమా ఒక కళ, కానీ ఇప్పుడు అది పూర్తిగా వ్యాపార రంగంలోకి మారిపోయిందని అనురాగ్ కశ్యప్ ఆవేదన వ్యక్తం చేశారు. గత ఏడాది బాలీవుడ్లో ఇమడలేక తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొన్నట్లు తెలిపారు. అందుకే ఇక బాలీవుడ్‌ను పూర్తిగా వదిలి, ఇండస్ట్రీకి సంబంధం లేకుండా వేరే ప్రదేశంలో స్థిరపడాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు.
వచ్చే ఏడాదికల్లా తాను ముంబై వదిలి వేరే ప్రాంతానికి మారిపోతానని అనురాగ్ కశ్యప్ తెలిపారు. బాలీవుడ్‌కు పూర్తిగా దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ఆయన బెంగళూరుకు షిఫ్ట్ అవుతారని సమాచారం. బాలీవుడ్ మదుపర్లపై, నిర్మాణ ధోరణులపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో పెద్ద చర్చకు దారితీసాయి.
