ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో నిర్వహించిన బీఎడ్ మొదటి సెమిస్టర్ పరీక్షలో ప్రశ్నాపత్రం లీక్ కావడం తీవ్ర కలకలం రేపింది. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహించాల్సిన “ప్రాస్పెక్టివ్స్ ఇన్ చైల్డ్ డెవలప్‌మెంట్” పరీక్ష ప్రశ్నాపత్రం పరీక్ష ప్రారంభానికి అరగంట ముందే బయటకు వచ్చిందని గుర్తించారు. ఈ విషయం తెలిసిన వెంటనే విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ హస్తక్షేపం చేసి పరీక్షను రద్దు చేశారు.
ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారంపై విద్యా శాఖ అధికారులను మంత్రి లోకేశ్ సమీక్షించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, లీక్‌కు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ కేసుపై పోలీసులకు స్పష్టమైన దిశానిర్దేశం అందించారు.
పోలీసులు విచారణ ప్రారంభించి, ఈ లీక్‌కు సంబంధించి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారు ఒడిశాకు చెందినవారిగా గుర్తించారు. లీక్ ఎలా జరిగింది? ఏవైనా అంతర్గత సంబంధాలు ఉన్నాయా? అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. ప్రధాన సూత్రధారులను గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.
ఈ ఘటన విద్యా వ్యవస్థలో ఆందోళన కలిగించగా, విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రశ్నాపత్రం లీక్ వెనుక ఉన్న అసలు కారణాలను వెలికితీసి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పునరుద్ధరించిన పరీక్ష తేదీపై అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది.
