బాలీవుడ్లో ఇటీవల సంచలనం రేపిన అంశాల్లో, ప్రముఖ నటి అను అగర్వాల్ వ్యాఖ్యలు కూడా చోటు దక్కించుకున్నాయి. అజయ్ దేవగన్ తండ్రి వీరూ దేవగన్ సలహా మేరకు నటుడు పరేశ్ రావల్ తన మూత్రం తాగినట్టు చెప్పిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే దారి లో బాలీవుడ్ నటి అను అగర్వాల్ కూడా మూత్రం తాగినట్లు వెల్లడించి అందరిని షాక్‌కు గురి చేశారు.
‘ఇన్‌స్టంట్ బాలీవుడ్’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అను అగర్వాల్ మాట్లాడుతూ, “మూత్రం తాగడం యోగాలో ఒక ముద్ర. దీనిని ‘ఆమ్రోలి’ అంటారు. ఇది శరీరానికి ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. నేను వ్యక్తిగతంగా ఈ పద్ధతిని పాటించాను. దీనివల్ల ముడతలు రావడం తగ్గుతుంది, శరీరం చలాకితనం పొందుతుంది” అని చెప్పుకొచ్చారు.
అయితే ఆమె వ్యాఖ్యలపై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. ఒకవైపు కొందరు ఆమె ధైర్యాన్ని ప్రశంసిస్తుండగా, వైద్య నిపుణులు మాత్రం దీన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు. “మూత్రం తాగడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు” అని ప్రముఖ వైద్యుడు డాక్టర్ సిరియాక్ అబ్బి ఫిలిప్స్ హెచ్చరించారు.
ఈ నేపథ్యంలో సెలబ్రిటీలు ఇలాంటి ఆరోగ్య సంబంధిత వ్యాఖ్యలు చేయడం వల్ల ప్రజలపై దుష్ప్రభావం పడవచ్చని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మూత్ర చికిత్సపై శాస్త్రీయ పరిశోధనల ఆధారాల్లేకుండా దాన్ని ప్రోత్సహించడం హానికరం అని హెచ్చరిస్తున్నారు.