అమెరికాలో వరుస విమాన ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. గత నెల 31న జరిగిన ఘటనలో 67 మంది మృతి చెందగా, తాజాగా మరో విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఆరిజోనాలోని రన్‌వేపై రెండు చిన్న విమానాలు ఢీకొన్న ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అమెరికా కాలమానం ప్రకారం బుధవారం ఉదయం ఈ ఘటన జరిగింది. సెస్నా 1725, లాంకైర్ 360 ఎంకే 11 అనే రెండు విమానాలు రన్‌వేపై ఢీకొన్నట్లు అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. అయితే, విమానాల్లో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు.
ప్రస్తుతం ఈ ప్రమాదానికి గల కారణాలపై విచారణ కొనసాగుతోంది. విమానాశ్రయ అధికారుల ప్రకారం, ఈ విమానాలు ట్రైనింగ్ పర్పస్ కోసం ఉపయోగించే చిన్న ఎయిర్‌క్రాఫ్ట్‌లుగా భావిస్తున్నారు. అయితే, ప్రమాదానికి ముందు ఎవైనా సాంకేతిక లోపాలు ఎదురైనాయా? లేదా మానవ తప్పిదమే కారణమా? అనే విషయాలను అధికారులు పరిశీలిస్తున్నారు.
ఇటీవల అమెరికాలో వరుసగా విమాన ప్రమాదాలు జరుగుతుండటంతో ప్రయాణికుల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. గత నెల జరిగిన హెలికాప్టర్-విమాన ప్రమాదంలో 67 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. తాజా ఘటన నేపథ్యంలో విమానయాన భద్రతపై మరోసారి చర్చ మొదలైంది.
