వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై కేసుల పరంపర కొనసాగుతోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ సీఐడీ పోలీసులు ఆయనకు నోటీసులు జారీ చేశారు. 2019లో విడుదలైన ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమాతో తమ మనోభావాలు దెబ్బతిన్నాయని తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ గతంలో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు గుంటూరు సీఐడీ పోలీసులు కేసు నమోదు చేసి, విచారణను చేపట్టారు.
ఈ నేపథ్యంలో వర్మను ఫిబ్రవరి 10న గుంటూరు సీఐడీ కార్యాలయంలో హాజరుకావాలని సూచిస్తూ సీఐ తిరుమలరావు నోటీసులు అందజేశారు. ఇదే సమయంలో వర్మపై మరో కేసులో ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్‌లో 9 గంటల పాటు విచారణ జరిగింది. సోషల్ మీడియాలో చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేశ్‌లపై చేసిన వ్యాఖ్యలతో సంబంధిత కేసులో ఆయనను పోలీసులు ప్రశ్నించారు.
వర్మ తెరకెక్కించిన ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమా విడుదల సమయంలోనే వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. ఇందులో కొన్ని అంశాలు కొన్ని వర్గాలను కించపరిచేలా ఉన్నాయంటూ అప్పట్లోనే పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆయనపై కేసు నమోదై, విచారణకు నోటీసులు రావడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
ప్రస్తుతం వర్మకు ఉన్న లీగల్ సమస్యలు మరింత పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. గతంలోనూ పలు సందర్భాల్లో వివాదాస్పద వ్యాఖ్యలు, సినిమాలతో వార్తల్లో నిలిచిన వర్మ, ఇప్పుడు మరోసారి చట్టపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. సీఐడీ విచారణలో ఆయన ఏ విధంగా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది.
