వైసీపీ హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా, ఆ తర్వాత ఏపీపీఎస్సీ కార్యదర్శిగా పనిచేసిన సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులుపై మరో కేసు నమోదైంది. ఇప్పటికే ముంబయి నటి కాదంబరి జత్వానీ కేసులో అరెస్టయిన ఆయన ప్రస్తుతం విజయవాడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. తాజాగా గ్రూప్-1 (2018) పరీక్షల మూల్యాంకన వ్యవహారంలో అవకతవకలు వెలుగులోకి వచ్చాయి.
ఈ వ్యవహారంలో పరీక్షా పత్రాల మూల్యాంకన సమయంలో నిధుల దుర్వినియోగం జరిగిందని ఆరోపణలు వెలుగులోకి రావడంతో పీఎస్ఆర్‌పై కేసు నమోదైంది. అప్పట్లో జరిగిన మౌలిక లోపాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ స్పందించి, డీజీపీకి విచారణ జరపాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో పోలీసులు నేరపూరిత కుట్ర, మోసం, నిధుల దుర్వినియోగంపై కేసు నమోదు చేశారు.
సూర్యారావుపేట పోలీస్ స్టేషన్‌లో నమోదు చేసిన ఈ కేసులో ప్రత్యేక బృందాలు దర్యాప్తు ప్రారంభించాయి. విచారణ బాధ్యతను ఓ సీనియర్ అధికారికి అప్పగించినట్లు సమాచారం. విచారణ గోప్యంగా కొనసాగుతున్న నేపథ్యంలో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది.
ప్రస్తుతం పీఎస్ఆర్ ఆంజనేయులు ఇప్పటికే ఉన్న కేసులో రిమాండ్‌లో ఉండటంతో, తాజా కేసుపై విచారణ పూర్తయిన తర్వాత ఈ వ్యవహారాన్ని ఏసీబీకి బదిలీ చేసే అవకాశం ఉంది. ప్రభుత్వ స్థాయిలో జరుపుతున్న దర్యాప్తుకు అనుగుణంగా ఈ కేసు మరింత కీలక మలుపులు తిరిగే సూచనలు కనిపిస్తున్నాయి.