ఒకప్పుడు రాజుల ఏలుబడిలో ఉన్న తుమ్మూరు గ్రామం నేడు చారిత్రక శేషాలను వెలికితీస్తోంది. అడపాదడపా రైతులు వ్యవసాయ పనులు చేస్తుండగా పురాతన వస్తువులు బయటపడుతున్నాయి. తాజాగా ఓ రైతు పొలం దున్నుతుండగా నాగలి కర్రకు పట్టి శిధిలావస్థలో ఉన్న పురాతన కత్తి వెలుగులోకి వచ్చింది. గతంలో కూడా అదే ప్రాంతంలో పంచలోహాల వీరభద్రుని విగ్రహాలు బయటపడ్డ ఘటనలు ఉన్నాయి.
కళ్యాణ స్వామి ఆలయ పరిసరాల్లో కాకతీయుల కాలానికి చెందిన అనేక చారిత్రక నిర్మాణాలు, సొరంగ మార్గాలు కనబడుతున్నాయి. ఇటీవలి కాలంలో రైతు పొలంలో బయటపడిన కత్తి రాజుల కాలం నాటిదిగా అనిపిస్తుందని గ్రామస్థులు భావిస్తున్నారు. కత్తిని పక్కనే ఉన్న ఆలయంలో భద్రపరిచారు. అయితే, ఈ కత్తి బయటపడిన పది రోజులు గడుస్తున్నా పురావస్తు శాఖ కానీ, ప్రభుత్వ అధికారులు కానీ పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తుమ్మూరు గ్రామ పరిసరాల్లో చారిత్రక ప్రాముఖ్యత ఉన్న అనేక ఆనవాళ్లు కనిపిస్తున్నప్పటికీ, పురావస్తు శాఖ అవసరమైన పరిశోధనలు చేపట్టడం లేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. గతంలో గుప్తనిధుల కోసం అనేక దొంగ తవ్వకాలు జరగగా, వాటిపై సరిగ్గా చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు గుర్తుచేశారు.
గ్రామ చరిత్రను వెలికి తీయడంలో పురావస్తు శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. తుమ్మూరు గ్రామంలో నిజంగా రాజులు ఏలుబడి సాగించారా? పురాతన కత్తి ఎలాంటి చారిత్రక ప్రాముఖ్యత కలిగి ఉంది? అనే అంశాలపై అధికారిక పరిశోధన జరిపించాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.

 
				 
				
			 
				
			