తిరుమల గోశాలలో వందకు పైగా గోవులు మృతి చెందాయంటూ వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తీవ్రంగా స్పందించారు. భూమన వ్యాఖ్యలు అవాస్తవమని ఖండించారు. టీటీడీ గోశాలలో జరిగిన సంఘటనలను అతిశయోక్తిగా, గోబెల్స్ ప్రచారంలా తయారుచేస్తున్నారని మండిపడ్డారు.
గోవుల విలువ తెలియని వ్యక్తులు ఈ ప్రచారాన్ని చేస్తున్నారు అని వ్యాఖ్యానించిన ఆనం, ముఖ్యమంత్రి చంద్రబాబు గోవును తల్లిగా భావిస్తారని తెలిపారు. సీఎం సహా డిప్యూటీ సీఎం ప్రతిరోజూ గోశాలలో గోవుల స్థితిని సమీక్షిస్తారని చెప్పారు. వయోభారం, సహజ మరణాలే గోవుల మరణాలకు కారణమని వివరించారు.
గోశాలలో 230 మంది సిబ్బంది పని చేస్తున్నారని, గోవులకు అన్ని అవసరమైన వసతులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఒకే దారిలో ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించొద్దని హెచ్చరించారు. అనారోగ్యం లేదా వృద్ధాప్యంతో చనిపోయిన ఆవులను కూడా రాజకీయంగా ఉపయోగించుకోవడమేమిటని ప్రశ్నించారు.
అమ్మ అనే పదానికి అర్థం తెలియని వ్యక్తి జగన్ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు మంత్రి ఆనం. హిందూ ధర్మాన్ని తమ కుటుంబాల్లో పాటిస్తున్నారా? అని వైసీపీ నాయకులను ఉద్దేశించి ప్రశ్నించారు. ఈ విమర్శలతో రాజకీయ వేడి మరింత పెరిగే అవకాశం ఉంది.
