సినీ నటుడు అల్లు అర్జున్ ఈరోజు నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. ఇటీవల సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి కోర్టు ఆదేశాల ప్రకారం ఆయన కోర్టుకు వెళ్లారు. ఈ సందర్భంలో ఆయన మామ చంద్రశేఖర్ రెడ్డితో కలిసి కోర్టుకు చేరుకుని బెయిల్ పత్రాలను సమర్పించారు. పత్రాలు సమర్పించిన అనంతరం అల్లు అర్జున్ తన ఇంటికి తిరిగి వెళ్లారు.
గత నెలలో పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు గాయపడిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేసి, కేసు నమోదు చేశారు.
ఆ తర్వాత హైకోర్టు ఆయనకు నాలుగు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. నిన్న నాంపల్లి కోర్టు పూర్తిస్థాయి బెయిల్ ఇచ్చింది. కోర్టు ఆదేశాల ప్రకారం రూ.50 వేల పూచీకత్తు పత్రాలను సమర్పించాలని, సాక్షులను ప్రభావితం చేయవద్దని, కేసు మీద వ్యాఖ్యలు చేయవద్దని పేర్కొంది.
ఇవే కాకుండా, రెండునెలల పాటు ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు వ్యక్తిగతంగా హాజరు కావాలని కోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో నేటి ఉదయం అల్లు అర్జున్ కోర్టుకు హాజరై, అవసరమైన పత్రాలను సమర్పించారు.