వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఉత్తరాంధ్ర నుంచే కూటమి పతనం ప్రారంభమైందని, ఎంఎల్సీ ఉప ఎన్నికల్లో కూటమి అభ్యర్థికి 30% కన్నా ఎక్కువ ఓట్లు పోలవ్వలేదని అన్నారు. ఉపాధ్యాయుల తీర్పు ప్రజల అభిప్రాయానికి అద్దం పడుతుందని, ఇది కూటమి ప్రభుత్వానికి మేలుకోల అని సూచించారు.
ఉపాధ్యాయులకు జీతాలు సకాలంలో అందడం లేదని, బకాయిల చెల్లింపులు లేక ఇబ్బందులు పెరుగుతున్నాయని విమర్శించారు. కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగిస్తూ ప్రభుత్వం తప్పుడు నిర్ణయాలు తీసుకుంటోందని ఆరోపించారు. ఉద్యోగుల సంక్షేమాన్ని పట్టించుకోని కూటమి ప్రభుత్వం, ప్రజలకు నష్టమే కలిగిస్తోందని ఆయన ధ్వజమెత్తారు.
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కూటమి అభ్యర్థిగా పాకలపాటి రఘువర్మను ప్రకటించారని, ఆయనకు మద్దతుగా మీటింగ్‌లు పెట్టారని, పత్రికల్లో ప్రకటనలు కూడా ఇచ్చారని గుర్తుచేశారు. ఇప్పుడు రఘువర్మ కూటమి అభ్యర్థి కాదని టీడీపీ చెప్పడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు.
కూటమి ప్రభుత్వం పాలనలో పూర్తిగా విఫలమైందని, ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు నెరవేర్చడం లోపించిందని మజ్జి శ్రీనివాసరావు విమర్శించారు. ఉత్తరాంధ్ర ప్రజలు కూటమిపై నమ్మకం కోల్పోయారని, రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు.
