అక్కినేని కుటుంబం ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీని కలిసి ప్రత్యేకంగా భేటీ అయ్యింది. ఈ సమావేశానికి నాగార్జున, అమల, నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల హాజరయ్యారు. ప్రధానితో సమావేశంలో అక్కినేని నాగేశ్వరరావు జీవిత చరిత్రపై రూపొందిస్తున్న పుస్తకం గురించి చర్చ జరిగినట్లు సమాచారం. పుస్తకాన్ని త్వరలోనే విడుదల చేయనున్నారు.
భేటీ అనంతరం అక్కినేని కుటుంబ సభ్యులు పార్లమెంట్ సందర్శించారు. పార్లమెంటులో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన అభిమానులు ఆసక్తిగా స్పందిస్తున్నారు. కాగా, నాగార్జున, చైతన్యల ప్రస్తుత ప్రాజెక్టులపై మోదీ ప్రత్యేకంగా ఆసక్తి కనబరిచినట్లు తెలుస్తోంది.
ఇటీవల మోదీ తన మన్‌కీ బాత్ కార్యక్రమంలో అక్కినేని నాగేశ్వరరావును ప్రత్యేకంగా ప్రస్తావించారు. భారతీయ సినిమాకు ఆయన అందించిన విశేష సేవలను కొనియాడారు. ఈ మాటలు అక్కినేని అభిమానులకు గర్వకారణంగా మారాయి. దీంతో అక్కినేని కుటుంబ సభ్యులు మోదీకి ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ భేటీపై అక్కినేని అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని మోదీని కలిసిన సందర్భంలో తీసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా అక్కినేని కుటుంబం చేసిన చర్చలు, పుస్తకం లాంచ్ డేట్ పై సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

 
				 
				
			 
				 
				