ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళా చివరి దశకు చేరుకుంది. కోట్లాది మంది భక్తులు ఇందులో పాల్గొంటున్నారు. నిన్నటికి 50 కోట్ల మందికి పైగా భక్తులు పవిత్ర గంగా నదిలో పుణ్యస్నానాలు ఆచరించినట్లు యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం వెల్లడించింది. ఈ వేడుకకు ఇంకా లక్షలాది మంది భక్తులు రావాల్సి ఉందని అంచనా.
ఈ నేపథ్యంలో సమాజ్‌వాది పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ మహా కుంభమేళాను మరికొన్ని రోజులు పొడిగించాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనం అయిన కుంభమేళాకు అధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారని, వీరంతా పుణ్యస్నానం చేసేందుకు తగిన సమయం అవసరమని అన్నారు.
ప్రస్తుతం కుంభమేళా ఈ నెల 26న ముగియనుంది. కానీ భక్తుల రద్దీ భారీగా ఉండటంతో దీన్ని మరికొన్ని రోజులు పొడిగించాలని అఖిలేశ్ యాదవ్ విజ్ఞప్తి చేశారు. గతంలో మహా కుంభమేళా 75 రోజులు జరిపేవారని, కానీ ఈసారి సమయం తగ్గించారని అన్నారు.
కుంభమేళా సందర్భంగా భక్తులంతా పవిత్ర నదుల్లో స్నానం చేయాలని కోరుకుంటారు. అయితే వ్యవధి తక్కువగా ఉండటంతో అందరికీ అది సాధ్యమయ్యేలా లేదని అఖిలేశ్ అభిప్రాయపడ్డారు. అందుకే మరికొన్ని రోజులు పొడిగించి, భక్తులకు పుణ్యస్నానాల అవకాశాన్ని కల్పించాలని కోరారు.