నందమూరి బాలకృష్ణ హీరోగా ‘అఖండ-2’ సినిమా రూపొందుతోంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. గతంలో ఈ కాంబినేషన్‌లో వచ్చిన ‘అఖండ’ సినిమాతో భారీ విజయం సాధించినందువల్ల ఈ సినిమాపై మంచి హైప్ ఏర్పడింది. ఈసారి కూడా పెద్ద విజయం అందుకోవాలని చిత్ర యూనిట్ ఆశిస్తోంది.
ఈ చిత్రం కొన్ని కీలక సన్నివేశాలను గుడిమెట్ల కొండలు, కృష్ణానది పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించాలని బోయపాటి శ్రీను ప్లాన్ చేసుకున్నారు. సోమవారం, ఆయన ఎన్టీఆర్ జిల్లా నందిగామలో పర్యటించి అక్కడి స్థానికులతో మాట్లాడారు. ఈ ప్రాంతం షూటింగ్ కోసం అనువుగా ఉంటుందా అన్నది చర్చించారు.
ఇదిలా ఉంటే, ఈ చిత్రం ఇటీవల ఉత్తరప్రదేశ్‌లో జరిగే మహా కుంభమేళాలో కూడా షూట్ జరుగుతోంది. చిత్రంలో కీలకమైన సన్నివేశాలు ఈ మహా కుంభమేళాలో చిత్రీకరించినట్లు సమాచారం. ఈ సన్నివేశాల్లో బాలకృష్ణను పరమ శివ భక్తుడిగా చూపించనున్నారని తెలిసింది.
ఈ సన్నివేశాలు అత్యంత దైవత్వంతో, ప్రేక్షకులకు ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటాయని భావిస్తున్నారు. ఈ చిత్రం 14 రీల్స్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంటలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబరు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.