ప్రముఖ తమిళ నటుడు అజిత్ కుమార్ మంగళవారం రాత్రి చెన్నై విమానాశ్రయంలో జరిగిన తోపులాటలో స్వల్ప గాయాలపాలయ్యారు. ఆయన అభిమానుల అధిక సంఖ్యలో హాజరుకావడంతో అక్కడ గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో అజిత్ కాలికి స్వల్ప గాయం జరిగినట్లు సమాచారం. వెంటనే ఆయనను చికిత్స కోసం చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటన పద్మభూషణ్ అవార్డు కార్యక్రమం అనంతరం చోటు చేసుకుంది. ఢిల్లీ నుంచి తిరిగి చెన్నైకు వచ్చిన అజిత్‌కు అభిమానుల నుంచి పెద్ద స్థాయిలో స్వాగతం లభించింది. అభిమానులు ఒక్కసారిగా ముందుకు రావడంతో తోపులాట జరిగి, ఆయన గాయపడినట్లు ఆయన బృందం స్పష్టం చేసింది.
ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వివరించిన అజిత్ బృందం – గాయం తక్కువగా ఉందని, వైద్యులు ప్రాథమిక పరీక్షలు చేసి చికిత్స అందిస్తున్నారని వెల్లడించింది. ఏవిధమైన ఆందోళన అవసరం లేదని, ఆయన త్వరలోనే డిశ్చార్జ్ అవుతారని తెలిపింది. అభిమానులు ఆయన ఆరోగ్యం కోసం కలవరపడకూడదని విజ్ఞప్తి చేశారు.
ప్రస్తుతం అజిత్ ఆసుపత్రిలో విశ్రాంతి తీసుకుంటున్నారు. వైద్యులు ఈ రోజు సాయంత్రానికి ఆయనను డిశ్చార్జ్ చేసే అవకాశం ఉందని తెలిపారు. ఈ ఘటన తర్వాత ఆయన భద్రతను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్న చర్చ కూడా సినీ వర్గాల్లో సాగుతోంది. అభిమానులు భద్రతను గుర్తుపెట్టుకుని నియంత్రణలో ఉండాలని విన్నవిస్తున్నారు.
