దేశంలో నిరుద్యోగ సమస్య రోజురోజుకూ పెరుగుతోందని, ఉద్యోగ, ఉపాధి కల్పనలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మొజ్జాడ యుగంధర్ విమర్శించారు. ఏఐవైఎఫ్ 17వ జాతీయ మహాసభల లోగోను శుక్రవారం నరసన్నపేటలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బొత్స సంతోష్, కొన్న శ్రీనివాసరావు మాట్లాడుతూ, ప్రతి ఏడాది రెండు కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న హామీ అమలు కాకపోవడంతో యువత నిరాశకు గురవుతోందని తెలిపారు.
ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించడం ద్వారా ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతున్నాయని, నిరుద్యోగ భృతి కల్పించాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యావంతులైన యువత ఉద్యోగాల కోసం వలసలు వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. భగత్ సింగ్ నేషనల్ ఎంప్లాయిమెంట్ గ్యారంటీ యాక్ట్ ద్వారా యువతకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్లు అమలు చేయాలని, లేకపోతే దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టనున్నట్లు హెచ్చరించారు.
మత ఘర్షణలను ప్రేరేపించడం ద్వారా ప్రభుత్వాలు రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నాయని ఆరోపించారు. యువత సమస్యలను సరికొత్త విధానాలతో పరిష్కరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మే 15 నుంచి 18 వరకు తిరుపతిలో 17వ జాతీయ మహాసభలు జరుగనున్నాయి. వీటికి దేశవ్యాప్తంగా వెయ్యి మందికిపైగా ప్రతినిధులు హాజరవుతారు.
మే 15న తిరుపతిలో భారీ నిరుద్యోగుల ప్రదర్శన నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నేతలు అరవింద్, వసంత్, వాసు, క్రాంతి తదితరులు పాల్గొన్నారు.