- రైస్‌మిల్స్ ను ఇతర ప్రాంతాలకు మారుస్తాం
- మిల్లర్ల యజమానులు, అసోసియేషన్ నాయకులు సహకరించాలి
- వ్యాపారస్తుల్ని ప్రోత్సహించడమే ప్రభుత్వ ఉద్దేశం
- టీడీపీకి వస్తున్న మంచి పేరును చూడలేకే వైసీపీ ధర్నా
- వైసీపీ ధర్నాను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు
- రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖామంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ
నెల్లూరుకి విమానాశ్రయం ఎంతో అవసరమని…త్వరలోనే విమానాశ్రయ వర్క్ ను టేకప్ చేయడం జరుగుతుందని…రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖామంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ జిల్లా ప్రజలకి శుభవార్త చెప్పారు. నెల్లూరు కలెక్టరేట్‌లో….ఆయన రాష్ట్ర దేవదాయ, ధర్మదాయ శాఖామంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, కలెక్టర్ ఆనంద్, జేసీ కార్తీక్ లతో కలిసి రివ్వ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు జిల్లాలోని ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న దగదర్తి ఎయిర్ పోర్ట్, రైస్ మిల్లర్లను ఇతర ప్రాంతాలకు మార్చడం వంటి అంశాలను రివ్యూలో చర్చించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ మీడియాతో మాట్లాడుతూ….నెల్లూరు జిల్లాకి ఎంతో కాలం నుంచి పెండింగ్‌లో ఉన్న రెండు ముఖ్యమైన అంశాలను చర్చించేందుకే ఈ సమావేశం నిర్వహించామన్నారు. రైస్ మిల్స్ ఎక్కువగా కార్పొరేషన్ ఏరియాలో ఉన్నాయన్నారు. అయితే ఇప్పుడు ఎన్జీటీ చాలా కఠినంగా ఉందని తెలిపారు. రైస్ మిల్స్ ఉన్న ఏరియాల్లో నాలుగు రెట్లు ఎక్కువగా ప పొల్యూషన్ ఉందన్నారు. ఈ క్రమంలో ఎన్జీటీ నిబంధనల మేరకు…ఆ రైస్ మిల్లును ఆ ప్రాంతాల నుంచి మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. గతంలో నేను మంత్రిగా ఉన్న సమయంలోనే ఈ సమస్యపై మూడు అసోసియేషన్లతో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఎమ్మెల్యేలు సోమిరెడ్డి, శ్రీధర్‌రెడ్డి, అధికారులతో చర్చించడం జరిగిందని గుర్తు చేశారు. అయితే ఇప్పుడు వారికి ఎటువంటి నష్టం జరగకుండా, ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆయా ప్రాంత ఎమ్మెల్యేలు, కలెక్టర్ తో చర్చించి ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. కిసాన్ ఎస్ఈ జెడ్, కృష్ణపట్నం పోర్ట్ ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవడం లేదన్నారు. మీరు వ్యాపారాలు చేసుకుంటేనే రాష్ట్రానికి జీఎస్టీ కూడా బాగా వస్తుందన్నారు. వ్యాపారాస్తుల్ని ప్రోత్సహించడమే ఈ ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమన్నారు. అందుకనే రైస్ మిల్లర్ల యజమానులు, అసోసియేషన్ నాయకులు అందరూ ఒక నిర్ణయానికి వచ్చి ప్రభుత్వానికి సహకరించాలని ఆయన కోరారు. ఏ దేశమైనా, రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే ఇన్‌ఫ్రా స్టక్చర్ ముఖ్యమన్నారు. ఇన్‌ఫ్రా స్టక్చర్ అంటే రోడ్డు మార్గం, రైలు మార్గం, విమాన మార్గం, ఓడరేవు ఈ నాలుగు చాలా ఇంపార్ట్ టెంట్ అన్నారు. నెల్లూరుకి విమాన మార్గం కావాల్సిన అవసరం చాలా ఉందన్నారు. ఎందుకంటే కృష్ణపట్నం పోర్ట్, ఇంకా మరి కొన్ని పోర్టులు కూడా వచ్చేశాయన్నారు. వాటిలో కార్గో అనేది చాలా ముఖ్యమైందన్నారు. 2014-2019 టీడీపీ ప్రభుత్వంలోనే దీనిని మంజూరు చేయడం జరిగిందని…అయితే గత వైసీపీ ప్రభుత్వం దీనిని నెల్లూరులో కాదు…ఇంకో దగ్గర అని కొన్ని కారణాల వల్ల ఆపేశారన్నారు. ఎన్నికల ప్రచారంలో సీఎం చంద్రబాబునాయుడు నెల్లూరుకి వచ్చినప్పుడు మళ్లీ దగదర్తిలోనే విమానాశ్రయం పెడుతామని చెప్పారన్నారు. ఢిల్లీ వెళ్లినప్పుడు ఈ విషయంపై కేంద్ర మంత్రిని కలవడం జరిగిందని…ఆయన కూడా మీరు స్థలంని సిద్ధం చేయండి…నేను వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేస్తానని చెప్పడం జరిగిందన్నారు. వచ్చే వారంలో దీని కోసం ఓ బృందాన్ని పంపిస్తారన్నారు. వీలైనంత త్వరలోనే నెల్లూరుకి విమానాశ్రయ వర్క్ లను టేకప్ చేయడం జరుగుతుందని…ఆయన జిల్లా ప్రజలకి శుభవార్త చెప్పారు.
ఇసుక అక్రమాలపై స్పందించిన మంత్రి
ఇసుక అక్రమాలు జరుగుతాయన్న ప్రశ్నకు మంత్రి నారాయణ స్పందించారు. గత ప్రభుత్వంలో ధరలు అధికంగా ఉన్నప్పుడు ఏమీ చేయలేదని…టీడీపీ ప్రభుత్వంలో ధరలు బాగా తగ్గిపోయాయని…అయితే వైసీపీ వాళ్లు ధర్నాలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. టీడీపీకి మంచి పేరు వస్తుందని…దీనిని చూడలేకనే వైసీపీ రాజకీయ ఎత్తుగడల కోసమే ధర్నా చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
అనంతరం రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతూ నెల్లూరు నగరం చుట్టూ ఉన్న రైస్ మిల్లులను ఇతర ప్రాంతాలకు తరలించాలని భావిస్తున్నామని చెప్పారు. ఒకప్పుడు నగర శివార్లలో ఉన్న ఈ మిల్లులు నేడు నగరం విస్తరించడంతో నడిబొడ్డులోకి వచ్చాయన్నారు. కృష్ణ పట్నం పోర్టు… లేదా కిసాన్ ఎస్.ఈ.జెడ్ లోకి మార్చాలని భావిస్తున్నట్లు తెలియజేశారు. ఈ మేరకు రైస్ మిల్ అసోసియేషన్లతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. జిల్లాకు ఎంతో అవసరమైన దగదర్తి విమానాశ్రయ పనులు కూడా త్వరలో ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. కృష్ణపట్నం… రామయ్య పట్నం పోర్టులు.. జువ్వల దిన్నె ఫిషింగ్ హార్బర్ లు ఉన్నాయని, వీటికి అనుబంధంగా పరిశ్రమలు రానున్నాయని మంత్రి ఆనం తెలిపారు. వీటికి విమానాశ్రయం ఎంతో అవసరం ఉందన్నారు. విమానాశ్రయానికి 13 వందల 79 ఎకరాలు అవసరమని గుర్తించామని చెప్పారు. కొంత భూమికి పరిహారం ఇచ్చామని, అయితే ఇంకా భూమిని సేకరించాల్సి ఉందన్నారు. ఈ విషయంపై కేంద్ర మంత్రి రామమోహన్ నాయుడుతో చర్చిస్తామని తెలిపారు. త్వరలోనే ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ప్రతినిధులు వచ్చి పరిశీలన చేస్తారని మంత్రి ఆనం రామనారాయణ తెలియజేశారు.
