శుక్రవారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఐపీఎల్ 34వ మ్యాచ్ RCB, PBKS మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీకి సంబంధించిన ఓ విస్మరణీయ సంఘటన చోటుచేసుకుంది. 18 ఏళ్ల క్రితం జరిగిన మొదటి ఐపీఎల్ మ్యాచ్‌లో జరిగిన విధంగానే, ఈ మ్యాచ్‌లోనూ కోహ్లీ ఒక్క పరుగు చేసి ఔటయ్యాడు. ఆ సమయంలో అతను ఐదో బంతికి ఔట్ కాగా, ఈసారి మూడు బంతులు మాత్రమే ఎదుర్కొన్నాడు.
2008లో జరిగిన తొలి మ్యాచ్ ఎప్పటికీ అభిమానులకు గుర్తుండే ఘటన. కోల్‌కతాతో జరిగిన ఆ మ్యాచ్‌లో కోహ్లీ అశోక్ దిండా బౌలింగ్‌లో ఒక పరుగు చేసి ఔట్ అయ్యాడు. అదే విధంగా ఈసారి కూడా పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో అర్ష్‌దీప్ బౌలింగ్‌లో ఒక్క పరుగు చేసి పెవిలియన్ చేరాడు. ఈ రెండూ చిన్నస్వామి స్టేడియంలో జరగడం ప్రత్యేకం.
ఆర్‌సీబీ బ్యాటర్లు ఈ మ్యాచ్‌లో పూర్తిగా విఫలమయ్యారు. వర్షం కారణంగా మ్యాచ్‌ను 14 ఓవర్లకు కుదించారు. పంజాబ్ బౌలర్లు దాటిగా దాడి చేయడంతో బెంగళూరు బ్యాటర్లు వరుసగా ఔట్ అయ్యారు. టిమ్ డేవిడ్ (నాటౌట్ 50), రజత్ పాటీదార్ (23) మాత్రమే రెండంకెల స్కోరు చేయగలిగారు. చివరికి ఆర్‌సీబీ 95 పరుగులకే పరిమితమైంది.
పంజాబ్ కింగ్స్ 96 పరుగుల లక్ష్యాన్ని 12.1 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ రెండు మ్యాచ్‌లలోనూ కోహ్లీ ఒక్క పరుగు చేసి ఔటవడం, ఆర్‌సీబీ ఓటమిపాలవడం, మరియు చిన్నస్వామిలోనే ఆ రెండు మ్యాచులు జరగడం ఇదొక యాదృచ్ఛిక సంఘటనగా అభిప్రాయపడుతున్నారు అభిమానులు. కోహ్లీ అభిమానులు మాత్రం మరోసారి నిరాశ చెందాల్సి వచ్చింది.
