అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై అఫ్గానిస్థాన్ తాలిబన్ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. బాగ్రాం వైమానిక స్థావరాన్ని మళ్లీ స్వాధీనం చేసుకుంటామని ట్రంప్ హెచ్చరించగా, తాలిబన్ నేతలు దీనిపై ఘాటుగా స్పందిస్తూ, “అఫ్గాన్ నేల నుంచి ఒక్క అంగుళం కూడా అమెరికాకు ఇవ్వం” అని స్పష్టం చేశారు.
తాలిబన్ రక్షణశాఖ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఫసివుద్దీన్ ఫిత్రాత్ మాట్లాడుతూ, “బాగ్రాం ఎయిర్‌బేస్‌పై ఎలాంటి రాజకీయ ఒప్పందం జరగదు. మా స్వయంప్రతిపత్తి, భూభాగ సమగ్రత కోసం చివరివరకు పోరాడతాం. ఎవరి బెదిరింపులకు భయపడేది లేదు” అని హెచ్చరించారు.
ఇటీవల ట్రంప్, బ్రిటన్ పర్యటనలో మాట్లాడుతూ చైనా అణ్వాయుధ ఉత్పత్తి కేంద్రాలకు దగ్గరగా ఉన్న బాగ్రాం ఎయిర్‌బేస్‌ను తిరిగి తీసుకోవడం అవసరం అని అన్నారు. కేవలం గంట వ్యవధిలోనే చైనా అణు సదుపాయాలను చేరుకోవచ్చని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై చైనా కూడా స్పందించింది. చైనా విదేశాంగశాఖ ప్రతినిధి లిన్ జియాన్ మాట్లాడుతూ, “అఫ్గాన్ భవిష్యత్తు అక్కడి ప్రజల చేతుల్లోనే ఉంది. ఉద్రిక్తతలు పెంచే ప్రయత్నాలకు మద్దతు లేదు” అని స్పష్టం చేశారు.
ప్రస్తుతం అమెరికా–తాలిబన్ మధ్య అధికారిక దౌత్య సంబంధాలు లేకున్నా, ఖైదీల మార్పిడి వంటి అంశాలపై ఇరుదేశాలు చర్చలు జరుపుతున్నాయి. ఈ మధ్య అమెరికా పర్యాటకుడి అపహరణ కేసు తర్వాత, తాలిబన్ ప్రభుత్వం అతడిని విడుదల చేసింది. అమెరికాతో సంబంధాలను మెరుగుపరచడానికి తాలిబన్ ప్రభుత్వం ఆసక్తి చూపుతున్నప్పటికీ, భూభాగ సమగ్రతపై మాత్రం ఎలాంటి రాజీకి సిద్ధం కాదని తాజా ప్రకటనతో మరోసారి స్పష్టం చేసింది.