వివాదాస్పద బాలీవుడ్ నటి పూనం పాండేకు తాజాగా ఓ చేదు అనుభవం ఎదురైంది. ఓ ఫొటో సెషన్లో భాగంగా విలేకరులతో మాట్లాడుతుండగా, వెనుక నుంచి వచ్చిన అభిమాని సెల్ఫీ కోసం ఆమెను దగ్గరకు చేరాడు. మొదట ఆమె అతడికి సెల్ఫీ ఇచ్చే ప్రయత్నం చేయగా, అకస్మాత్తుగా అతను బలవంతంగా ముద్దు పెట్టుకునేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటనతో అక్కడున్న వారు ఒక్కసారిగా షాక్ అయ్యారు.
అతడి ప్రవర్తనతో వెంటనే స్పందించిన పూనం పాండే అతడిని బలంగా నెట్టివేసింది. ఆమెకు సహాయం చేయడానికి అక్కడున్న ఫొటో జర్నలిస్టు కూడా ముందుకు వచ్చి ఆ అభిమాని నుంచి రక్షించాడు. ఈ సంఘటనపై నటి ఇంకా అధికారికంగా స్పందించలేదు. అయితే, ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
ఈ వీడియోపై నెటిజన్లలో భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఇది ముందుగా ప్లాన్ చేసిన స్క్రిప్టెడ్ డ్రామా అని, ప్రచారం కోసం నటి కావాలని ఇదంతా చేసింది అని ఆరోపిస్తున్నారు. మరికొందరు మహిళల భద్రత గురించి చర్చిస్తున్నారు. పూనం గతంలో వివాదాస్పద చర్యలు చేసిన నేపథ్యంలో ఈ ఘటనపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
గతంలోనూ పూనం పాండే పలు వివాదాల్లో నిలిచింది. గత ఏడాది గర్భాశయ క్యాన్సర్‌పై అవగాహన పెంచడానికి తాను చనిపోయినట్టు నమ్మించి వార్తల్లో నిలిచింది. ఆ తర్వాత తాను బతికే ఉన్నానని ప్రకటించి వివరణ ఇచ్చుకుంది. సినిమాల కంటే బోల్డ్ ఫొటోషూట్లు, వివాదాస్పద వ్యాఖ్యలతోనే ఎక్కువగా ప్రచారంలో ఉండే పూనం, తన వ్యక్తిగత జీవితం, వివాహం, విడాకుల విషయాల వల్ల తరచూ వార్తల్లో నిలుస్తోంది.
