ఒకప్పటి కథానాయిక కె. విజయ అనేక చిత్రాలలో నటించి, తెలుగు, తమిళ, కన్నడ సినీ పరిశ్రమల్లో మెరిసారు. ‘జగమేమాయ’ చిత్రంతో కథానాయికగా ఎంట్రీ ఇచ్చిన ఆమె, ఆ సినిమా విజయం సాధించకపోవడం వల్ల గుర్తింపు ఆలస్యమైందని భావించారు. తెనాలి పట్టణంలో జన్మించిన విజయ, గుమ్మడి, నాగభూషణం వంటి సినీ ప్రముఖుల ద్వారా ఇండస్ట్రీకి వచ్చారు. సినిమా రంగంలో తన ప్రయాణం గురించి ఆమె తాజాగా ఇంటర్వ్యూలో వివరించారు.
విజయ మాట్లాడుతూ, తన కెరీర్‌లో అత్యధిక పారితోషికంగా 50 వేలు అందుకున్న విషయాన్ని గుర్తుచేసుకున్నారు. వివాహం అనంతరం సినిమాలకు పూర్తిగా గుడ్‌బై చెప్పిన ఆమె, ప్రస్తుతం ఆర్థికంగా స్థిరంగా ఉన్నానని, ఎవరైనా సహాయం కోరితే చేయగల స్థితిలో ఉన్నానని తెలిపారు. తన కెరీర్‌లో కొన్ని పాత్రలు మొహమాటంతో చేసినా, వాటిపై ఇప్పుడు ఎలాంటి విచారం లేదని వెల్లడించారు.
సావిత్రిగారిపై ఎంతో గౌరవం కలిగి ఉన్నానని, ఆమె మంచితనాన్ని ఎప్పటికీ మరిచిపోలేనని విజయ తెలిపారు. ఒకసారి ఓ రైలు ప్రయాణంలో సావిత్రి టికెట్ లేకుండా చిక్కుకున్న ఘటనను గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో ఆమె షూటింగ్ టీమ్ తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. వెంటనే టీసీకి డబ్బు ఇచ్చి సావిత్రిగారిని సాయం చేసినట్లు వెల్లడించారు.
ఆ ఘటన తర్వాత సావిత్రిగారు మద్రాస్ వెళ్లిన వెంటనే తన ఇంటి చిరునామా కనుక్కొని, టికెట్ డబ్బు తిరిగి పంపించారని విజయ భావోద్వేగంతో తెలిపారు. ఆ సమయంలో ఆమె చూపిన కృతజ్ఞత తనను ఎంతగానో కదిలించిందని, ఆ సంఘటన జీవితాంతం గుర్తుండిపోతుందని పేర్కొన్నారు.
