మలికిపురం మండలం లక్కవరం MG గార్డెన్‌లో ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. ఆయనతో పాటు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్, పొలిట్ బ్యూరో సభ్యులు రెడ్డి సుబ్రహ్మణ్యం, మాజీ ఎమ్మెల్యే పీతల సుజాత తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, తెదేపా అధిష్టానం తీసుకున్న నిర్ణయమే ఫైనల్ అని స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు చొరవతో రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్ట్ సహా పలు నిధులు రావడానికి అవకాశం కలిగిందని తెలిపారు. త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసి 17,500 ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఏపీకి భారీగా నిధులు కేటాయించిందని, కానీ వైసీపీ మాత్రం విమర్శలు చేయడం సిగ్గుచేటని అన్నారు.
ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెదేపా అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని మంత్రి పిలుపునిచ్చారు. ఎన్నికల అనంతరం రాజోలు తెదేపా ఇంచార్జిని ప్రకటిస్తామని తెలిపారు. ప్రతి కార్యకర్త ఒక సైనికునిలా పనిచేసి, పార్టీ విజయాన్ని సాధించేందుకు కృషి చేయాలని సూచించారు.
చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఏడాది తిరగకముందే అభివృద్ధి కార్యక్రమాలను వేగంగా అమలు చేసిందని అచ్చెన్నాయుడు అన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాక, అభివృద్ధి లేక అయిదేళ్ల పాటు వైసీపీ పాలన దౌర్భాగ్యంగా కొనసాగిందని వ్యాఖ్యానించారు. రాజోలులో ఇంటింటికీ మంచినీటి సదుపాయం, డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

 
				 
				
			 
				
			 
				
			