ఎల్.బి.నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ బాలికను ప్రేమ పేరుతో వేధించిన నిందితుడు పల్లపు మహీంద్రను కోర్టు దోషిగా నిర్ధారించింది. నిందితుడు బాలికను అసభ్యంగా ప్రవర్తిస్తూ, మానసిక ఒత్తిడి కలిగించేలా మౌఖికంగా వేధించాడని విచారణలో తేలింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి న్యాయస్థానానికి అప్పగించారు.
ఈ కేసు క్రైమ్ నెంబర్ 283/2023గా నమోదై, భారతీయ శిక్షాస్మృతి సెక్షన్ 354(D), 506 IPC & పోక్సో చట్టం సెక్షన్ 11, 12 కింద విచారణ జరిగింది. రంగారెడ్డి జిల్లా ఎల్.బి.నగర్ ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక న్యాయమూర్తి గౌరవ న్యాయమూర్తి గారు 19-02-2025 తేదీన తీర్పు వెలువరించారు.
తీర్పులో నిందితుడికి ఏడాది కఠిన కారాగార శిక్ష విధించడంతో పాటు రూ.2,000 జరిమానా విధించారు. అలాగే బాధిత బాలికకు రూ.50,000 పరిహారం అందించాలని నిర్ణయించారు. ఈ కేసులో అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు శ్రీమతి సునీత, ఎం. రఘు వాదనలు వినిపించారు.
న్యాయస్థానం తీర్పు బాధిత బాలికకు న్యాయం కలిగించిందని పోలీసులు తెలిపారు. మైనర్ బాలికల భద్రతకు భరోసా కల్పించేలా కఠిన శిక్షలు విధించడం మంచి సంకేతమని అధికారులు పేర్కొన్నారు. ఎలాంటి వేధింపులు జరిగినా తల్లిదండ్రులు, బాధితులు పోలీసులను సంప్రదించాలని సూచించారు.
