ముంబయిలోని వాంఖడే స్టేడియంలో జరిగిన ఐదో టీ20లో భారత జట్టు 150 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై ఘన విజయం సాధించింది. ఈ విజయానికి యువ క్రికెటర్ అభిషేక్ శర్మ అద్భుతమైన ఆల్ రౌండ్ ప్రదర్శనతో ప్రధాన కారణమయ్యాడు. కేవలం 54 బంతుల్లో 135 పరుగులు చేసి, ఓవర్లో రెండు వికెట్లు తీసి, మ్యాచ్‌ను పూర్తిగా భారత్‌వైపు తిప్పేశాడు.
అభిషేక్ అద్భుత ప్రదర్శనపై భారత మాజీ క్రికెట్ దిగ్గజం, మెంటార్ యువరాజ్ సింగ్ ప్రత్యేకంగా ప్రశంసించాడు. ‘ఎక్స్’ (ట్విట్టర్) ద్వారా స్పందించిన యువీ, “నిన్ను నేను ఎక్కడ చూడాలనుకున్నానో, నీవు ఇప్పుడు అక్కడే ఉన్నావు. గర్వంగా ఉంది!” అంటూ ప్రశంసలు కురిపించాడు. అభిషేక్‌ను శిష్యుడిగా తీసుకున్న యువరాజ్ సింగ్ తన ఆటను నిరూపించుకున్న శర్మపై గర్వంగా ఉన్నట్లు చెప్పుకొచ్చాడు.
ఈ సిరీస్‌లో మొదటి మ్యాచ్‌లోనూ అభిషేక్ శర్మ మెరుపులు మెరిపించాడు. 34 బంతుల్లో 79 పరుగులు చేసి, అప్పటికే యువీ ప్రశంసలు అందుకున్నాడు. అయితే వాంఖడే స్టేడియంలో అతడు చేసిన 135 పరుగుల ఇన్నింగ్స్ భారత జట్టు విజయంలో కీలకంగా మారింది. భారత్ 20 ఓవర్లలో 247 పరుగులు చేయగా, ఇంగ్లండ్ 97 పరుగులకే ఆలౌట్ అయింది.
భారత బౌలర్లు అద్భుతంగా రాణించడంతో ఇంగ్లండ్ 150 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఈ విజయంతో భారత జట్టు 4-1 తేడాతో సిరీస్‌ను దక్కించుకుంది. అభిషేక్ శర్మ ఆటతీరు, యువరాజ్ మెచ్చుకోవడం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. “గురువుకు తగ్గ శిష్యుడు” అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.