టీమిండియా యువ క్రికెటర్ అభిషేక్ శర్మ ఇటీవల ముగిసిన ఇంగ్లండ్ టీ20 సిరీస్‌లో అదరగొట్టాడు. 37 బంతుల్లోనే శతకంతో అందరి దృష్టిని ఆకర్షించిన అభిషేక్, దూకుడైన ఓపెనర్‌గా గుర్తింపు పొందాడు. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడుతున్న ఈ యువ ఆటగాడికి ఇప్పుడు మరో బంపరాఫర్ దక్కినట్లు వార్తలు వస్తున్నాయి.
SRH యాజమాన్యం అభిషేక్ శర్మను 2025 ఐపీఎల్ సీజన్‌కు వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేసినట్లు క్రికెట్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. గత సీజన్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచిన అభిషేక్, కీలక విజయాల్లో భాగస్వామిగా నిలిచాడు. అతని స్థిరమైన రన్‌స్కోరింగ్, ఒత్తిడిలోనూ ప్రశాంతంగా ఉండే స్వభావం, సహచర ఆటగాళ్లతో కలిసిపొలిగే తత్వం కారణంగా ఈ పదవి దక్కినట్లు సమాచారం.
ఇకపోతే, SRH కెప్టెన్‌గా ఉన్న ప్యాట్ కమిన్స్ ప్రస్తుతం గాయంతో బాధపడుతున్నాడు. అతని గాయం తీవ్రంగా ఉండటంతో త్వరలో ప్రారంభం కానున్న ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అతను ఐపీఎల్ 2025లో ఆడతాడా లేదా అనే అంశం కూడా సందేహంలో ఉంది.
ఈ నేపథ్యంలోనే SRH యాజమాన్యం కొత్త కెప్టెన్, వైస్ కెప్టెన్ నియామకంపై చర్చిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా అభిషేక్ శర్మకు ఈసారి వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించినట్లు క్రికెట్ వర్గాల్లో ఊహాగానాలు వెలువడుతున్నాయి.