టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు, వైసీపీ నేత భూమన అభినయ్ రెడ్డి గోశాలకు వెళ్లేందుకు చేసిన ప్రయత్నం కలకలం రేపింది. తిరుపతిలో గల గోశాలలోకి ప్రవేశించేందుకు ఆయన యత్నించగా పోలీసులు వెంటనే అతన్ని అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు.
అభినయ్ రెడ్డి మాట్లాడుతూ… గోశాలకు రావాలంటూ టీడీపీ చేసిన ఛాలెంజ్‌ను తాము స్వీకరించామని, అధికారాన్ని అడ్డం పెట్టుకుని టీడీపీ తమను అడ్డుకుందని తీవ్రంగా విమర్శించారు. “సవాళ్లు చేస్తారు, స్వీకరించి వస్తే అడ్డుకుంటారు… ఇదేనా పాలన?” అని ప్రశ్నించారు. పోలీసుల తీరుపై కూడా ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఇదిలా ఉండగా, తిరుపతిలోని భూమన ఇంటి వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఎంపీ గురుమూర్తితో పాటు వైసీపీ కార్యకర్తలతో కలిసి గోశాలకు వెళ్లేందుకు ప్రయత్నించిన అభినయ్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. కేవలం గన్‌మెన్‌తో మాత్రమే వెళ్లాలని, మిగతా అనుచరులతో వెళ్లే అవకాశం లేదని స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలో పోలీసులు, వైసీపీ శ్రేణుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని పోలీసులు వాదించగా, ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమని వైసీపీ నేతలు విమర్శించారు. మొత్తంగా ఈ సంఘటన తిరుపతిలో రాజకీయ వేడి పెరగడానికే దారి తీసింది.