చేగుంట మండలం కర్నాల్ పల్లి గ్రామంలోని షిరిడి సాయిబాబా దేవాలయ 14వ వార్షికోత్సవం, భక్తాంజనేయ దేవాలయ 19వ వార్షికోత్సవాలు అంగరంగ వైభవంగా ముగిశాయి. మూడు రోజులుగా జరిగిన వేడుకల్లో చండీ హోమం, పూర్ణాహుతి, ఆవు పూజ, కలశపూజలు నిర్వహించారు. 108 కళశాలతో స్వామివారికి అభిషేకం, స్వామివారి పల్లకీసేవ తదితర కార్యక్రమాలు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి.
వేడుకల్లో పాల్గొన్న తొగిట పీఠాధిపతి శ్రీ శ్రీ మాధవంద సరస్వతి స్వామీజీకి భక్తులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆయన దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులకు తీర్థప్రసాదం అందజేశారు. అనంతరం భక్తులతో సంభాషిస్తూ ప్రతి ఒక్కరిలో భక్తి భావం పెంపొందించుకోవాలని, ప్రేమ, ఆప్యాయతతో మెలగాలని సూచించారు. దోషరహిత జీవితంతో జీవుడు పరమాత్మ తత్వాన్ని అలవర్చుకోవాలని ఆయన పేర్కొన్నారు.
ఆధ్యాత్మికతతో ముందుకు సాగాలంటే కేవలం దేవాలయాల నిర్మాణం కాకుండా, ప్రతిరోజూ నిష్ఠతో ధూప దీప నైవేద్యాలతో స్వామిని ఆరాధించాల్సిన అవసరం ఉందని స్వామీజీ అన్నారు. ఆలయాల నిర్మాణానికి సార్థకత కలిగేలా నిత్య అన్నదాన పూజలు నిర్వహించాలని సూచించారు. ఈశ్వరీ పీఠం వ్యవస్థాపకులు రవిచంద్ర శర్మ, రాజేశ్వర శర్మలు భక్తిని పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపకులు ఆంజనేయులు, ఆలయ కమిటీ చైర్మన్ రమేష్ గుప్తా, ఇబ్రహీంపూర్ సొసైటీ చైర్మన్ కొండల్ రెడ్డి, యాదిరెడ్డి, తుమ్మ యాదగిరి, వంటరి రాంరెడ్డి, ఇమ్మడి లక్ష్మణ్, కొత్త నాగలింగం, గోపాల్ రెడ్డి, శ్రీనివాస్, గోలి ప్రకాష్, అంజిరెడ్డి, వివిధ గ్రామాల భక్తులు పాల్గొన్నారు.