తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్.ఎస్ అన్నారు, మంచి పుస్తకం ఒక మంచి స్నేహితుడి వంటిదని, పుస్తక పఠనం ఒక మంచి అలవాటు అని. ప్రతి ఒక్కరూ రోజూ కొంత సమయం మంచి పుస్తక పఠనానికి కేటాయించి దానిని తమ జీవితంలో భాగం చేసుకోవాలని ఆయన సూచించారు.
ఈ శనివారం ఇస్కాన్ టెంపుల్ ఎదురుగా జరుగుతున్న 17వ తిరుపతి పుస్తక ప్రదర్శనను కలెక్టర్ దంపతులు చిన్నారితో కలిసి సందర్శించారు. భారతీయ విద్యా భవన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శన ప్రజల మన్ననలు పొందుతుందని, వివిధ రంగాలకు సంబంధించిన అమూల్యమైన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ తెలిపారు.
ఈ ప్రదర్శనలో వివిధ రాష్ట్రాల నుండి 70 స్టాళ్లు ఏర్పాటయ్యాయని, ప్రతిరోజూ సాయంత్రం సంగీత, సాహిత్య కార్యక్రమాలు నిర్వహించామని నిర్వాహకులు డాక్టర్ సత్యనారాయణ రాజు, దక్షిణామూర్తి వివరించారు. ఆదివారం ప్రదర్శన ముగియనుండగా, ప్రజలు భారీగా తరలివస్తున్నారని తెలిపారు.
పలువురు పుస్తక ప్రేమికులు కలెక్టర్‌ను కలసి పుస్తక ప్రదర్శన ఎంతో ఉపయోగకరంగా ఉందని, అక్కడ జరుగుతున్న సాహిత్య, సంగీత కార్యక్రమాలు సందర్శకులను ఆకర్షిస్తున్నాయని తెలిపారు. కలెక్టర్ దంపతులు స్వయంగా పలు పుస్తకాలు కొనుగోలు చేసి ప్రదర్శనను తిలకించారు.
