రాంబిల్లి మండలం నావిగేట్ వెళ్లే రహదారిపై మితిమీరిన లోడుతో బండరాళ్ల రవాణా ప్రమాదకరంగా మారింది. నిన్న రాత్రి రాజుకోడూరు బస్ స్టాప్ వద్ద జరిగిన గోర ప్రమాదం తీవ్ర చర్చనీయాంశమైంది. ఓవర్‌లోడ్‌లో ఉన్న లారీలు ఒకదానికొకటి ఢీకొట్టడంతో డీజిల్ ట్యాంకులు ధ్వంసమయ్యాయి. తక్షణమే పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేసినప్పటికీ, ఇది సమర్థమైన పరిష్కారమని ప్రజలు భావించడం లేదు.
నావిగేట్ రహదారి పరిస్థితి అధ్వానంగా ఉండటం వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. వెంకటాపురం నుండి నావిగేట్ వరకు రహదారి మరమ్మతులపై అధికారులు దృష్టి పెట్టకపోవడమే ప్రధాన కారణమని ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రజల ప్రాణాలను పక్కనపెట్టి స్వలాభం కోసం నడిచే క్వారీ యాజమాన్యంపై తీవ్రమైన ఆగ్రహం వ్యక్తమవుతోంది.
క్వారీ నుండి నిత్యం వందల లారీలు అధిక లోడుతో నడుస్తుండటంతో పాదచారులు, వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల రహదారి వాడుతున్న ప్రజలు ప్రాణాల మీద తెగువకు వస్తున్నారు. ట్రాన్స్‌పోర్ట్ శాఖ, ఆర్టీవో అధికారులు ఇప్పటికీ స్పందించకపోవడం పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రమాదకర రవాణాను నియంత్రించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని పాదచారులు, వాహనదారులు విజ్ఞప్తి చేస్తున్నారు. బండరాళ్ల లోడును పరిమితిలో ఉంచి రవాణా చేస్తే ప్రమాదాలను నివారించవచ్చని సూచిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి నెలకొంది అని ప్రజలు మండిపడుతున్నారు.
