జోగులాంబ గద్వాల జిల్లా అయిజ పట్టణానికి చెందిన సబ్ కాంట్రాక్టర్ జహీర్, గత మూడు సంవత్సరాలుగా ప్రభుత్వ పనులకు పెట్టుబడులు పెట్టి తీవ్ర ఆర్థిక సమస్యలను ఎదుర్కొన్నారు. సీసీ రోడ్డు, మైనారిటీ హాల్, మిషన్ భగీరథ వంటి పనులకు పెట్టిన డబ్బులు బిల్లులుగా తిరిగివ్వకపోవడంతో తీవ్ర మనోవేదనకు గురయ్యారు.
తన పెట్టుబడికి మిత్తిలు కట్టలేక, చివరకు వావిలాల గ్రామంలోని పది ఎకరాల పొలాన్ని అమ్ముకున్న జహీర్, అప్పుల సగం కూడా తీర్చలేకపోయారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి హైదరాబాద్ వరకు ప్రజాప్రతినిధుల వద్ద ప్రదక్షిణలు చేసినా, బిల్లులు ఇవ్వకపోవడం అతడిని మరింత బాధగణానికి గురిచేసింది.
అప్పుల భారం నుంచి విముక్తి పొందలేక జహీర్ తీవ్ర మనస్తాపంతో ఆకస్మికంగా మరణించారు. జహీర్ కుటుంబ సభ్యులు, సన్నిహితులు ప్రభుత్వ పనులకు చేసిన ఖర్చులకు బిల్లులు రాకపోవడంతో ఈ దుస్థితి ఏర్పడిందని వాపోతున్నారు. ఎప్పుడూ చలాకీగా ఉండే జహీర్ లేకపోవడం కుటుంబానికి తీరని లోటుగా మారింది.
జహీర్ మృతితో ఆ ప్రాంత ప్రజలు, ప్రజాప్రతినిధులపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక నేతలు జహీర్ చేసిన పనుల బిల్లులు ఎందుకు పెండింగ్‌లో ఉన్నాయో పరిశీలించి, కుటుంబానికి ఆర్థిక సహాయం అందించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. జహీర్ కుటుంబం కనీసం మానవతా దృక్పథంతో ప్రభుత్వం నుండి సాయం పొందాలని ప్రజలు కోరుకుంటున్నారు.
