శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం డోలపేట గ్రామంలో స్మశాన స్థలం కబ్జా చేయడంతో స్మశానానికి వెళ్లడానికి దారిలేదని ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ మేరకు స్మశాన స్థలం 22 సెంట్లు ఉండగా అందులో 15 సెంట్లు ఆక్రమణదారులు కబ్జా చేశారు. అయితే కేవలం ఏడు సెంట్లకు మాత్రమే పరిమితమైంది. గ్రామంలో ఎవరైనా మృత్యువాడ పడితే మృతదేహాన్ని ఖననం చేసేందుకు కూడా అవకాశం లేని పరిస్థితి నెలకొంది. శ్మశానవాటికకి వెళ్లేందుకు రహదారి సౌకర్యంతో పాటు కనీస సౌకర్యాలు లేవని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. పొలం గట్ల వెంట సుమారు మూడు కిలోమీటర్ల మేర నడిచి వెళితే కానీ స్మశానానికి చేరుకోలేని పరిస్థితి అక్కడి గ్రామస్తులు.
ఎప్పటికప్పడు స్మశానం ఆక్రమణకు గురవుతున్నా స్థానికులు ఎంత ఇబ్బందులు పడుతున్నా ఇటు ప్రజా ప్రతినిధులు, అటు అధికారులు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారు. గతంలో గ్రామస్తులు అధికారులకు తమ గోడును విన్నవించుకున్నా, ఫిర్యాదు చేసినప్పటికీ అధికారుల నుండి స్పందన కరువైందని స్థానికులు ఆవేదన వెళ్లగక్కుతున్నారు. రెవిన్యూ అధికారులకు తెలిసినప్పటికి చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారన్న వాదనలు విన్పిస్తున్నాయి. అయితే 15సెంట్లు ఆక్రమణదారులు అక్రమంగా కబ్జా చేసినా ఎందుకు రెవెన్యూ సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తున్నారో సమాధానం చెప్పాలని గ్రామానికి చెందిన యువకులు నిలదీస్తున్నారు. కనీసం మృతదేహాన్ని తీసుకువెళ్ళడానికి కూడా దారిలేని పరిస్థితులు నెలకొన్నా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించక పోవడంపై స్థానికులు మండిపడుతున్నారు. తక్షణమే అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి స్మశానవాటిక కబ్జా చేసిన వారిపై తగు చర్యలు తీసుకొని స్మశానికి వెళ్లేందుకు దారి సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు.

 
				 
				
			 
				
			 
				
			