జోగులాంబ గద్వాల జిల్లా లోమంగళవారం గద్వాల పట్టణంలో నూతనంగా నిర్మించిన భరోసా సెంటర్ భవనానికి జిల్లా కలెక్టర్ బి ఎం సంతోష్ ఎస్పీ శ్రీనివాసరావుతో కలిసి ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, భరోసా సెంటర్ల ద్వారా మహిళలకు పూర్తి సంరక్షణ కల్పించే విధంగా సేవలు అందించడం జరుగుతుందన్నారు. మహిళలు, బాలికలపై జరిగే అత్యాచారాలు, అఘాయిత్యాలు, ఫాక్సో కేసులను ఈ సెంటర్ ద్వారా బాధితులకు న్యాయం, ఆర్థిక సహకారం అందించి వారికి భరోసా కల్పించడం జరుగుతుందన్నారు. మహిళలు ప్రతి ఒక్కరు భరోసా సెంటర్ ద్వారా లభించే సేవలు సదుపాయాలతో పాటు కేసు నమోదు లాంటి విషయాలపై అవగాహన పెంపొందించుకోవాలన్నారు. జిల్లా కేంద్రంలో భరోసా సెంటర్ నిర్మాణానికి మెగా ఇన్ఫ స్ట్రక్చర్ దాదాపు 2.10 కోట్ల రూపాయలు సొంత డబ్బులు వెచ్చించడం చాలా గొప్ప విషయం అని కొనియాడారు. ముందుగా జిల్లా ఎస్పీ, సంబంధిత అధికారులతో కలిసి కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన గావించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సంతోష్, ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ, భరోసా కేంద్రం ద్వారా బాధిత మహిళలు పిల్లలకు న్యాయం జరిగేలా కృషి చేయడం జరుగుతుందన్నారు. గద్వాలలో 2002లో భరోసా కేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. భరోసా కేంద్రంతో పాటు షీ టీమ్స్ పనిచేస్తుందని బాధిత మహిళలు, బాలలకు ఒకే గొడుగు క్రింద మెడికల్ , న్యాయ, కౌన్సిలింగ్, సైకలాజికల్ సపోర్టు వంటి అనీ సౌకర్యాలు ఒకే గొడుగు క్రింద అందజేయడం జరుగుతుందని తెలిపారు. భరోసా కేంద్రాలలో దేశంలోనే తెలంగాణ ముందంజలో ఉందని ఎస్పీ తెలిపారు. ఉమెన్స్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో న్యాయ సలహాలు, వైద్యం, సైకాలజీ తదితర సేవలు అదించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ నర్సింగ రావు, అడిషనల్ ఎస్పీ గుణశేఖర్, జిల్లా సంక్షేమ శాఖ అధికారి సుధారాణి, డి .ఎస్పి సత్యనారాయణ, సాయుధ దళ డి.ఎస్పి నరేందర్ రావు, పోలీసు శాఖ అధికారులు, సిబ్బంది, భరోసా సిబ్బంది, విద్యార్థినిలు తదితరులు పాల్గొన్నారు.
