ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం ప్రత్యేక కిట్ లను పంపిణీ చేయనుంది. ఈ కొత్త పథకం పేరు “సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర పథకం”. దీనికోసం ఏటా రూ.953.71 కోట్లు ఖర్చు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకం ద్వారా 35,94,774 మంది విద్యార్థులకు ప్రయోజనాలు కలుగుతాయని అధికారులు తెలిపారు. ఈ పథకాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో వచ్చే విద్యాసంవత్సరం నుంచి అమలు చేయాలని నిర్ణయించబడింది.
ఈ కిట్ లో విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, వర్క్ బుక్స్, నోటు బుక్స్, బెల్ట్, బూట్లు, బ్యాగ్, డిక్షనరీ మరియు మూడు జతల యూనిఫామ్లు ఉంటాయి. ఒక కిట్ ధర సగటున రూ.1,858 ఉంటుందని అధికారులు తెలిపారు. ఇందులో, 8వ తరగతి వరకు విద్యార్థుల కోసం రూ.120 మేర యూనిఫాం ఖర్చు, 9వ, 10వ తరగతుల విద్యార్థులకు మాత్రం రూ.240 చొప్పున ఖర్చు చేయనుంది. ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేయడం ద్వారా విద్యార్థుల విద్యా సంబంధిత అవసరాలను తీర్చడంతో పాటు, వారికి అవసరమైన సామాగ్రి అందించడంతో విద్యార్థుల చదువుకు మరింత ప్రోత్సాహం కలుగుతుందని భావిస్తోంది.