కేరళలో కొండచరియలు విరిగిపడడం: 80 మృతదేహాలు, 600 మంది కార్మికుల ఆచూకీ లభ్యం

కేరళలోని వయనాడ్ జిల్లాలో 600 మంది వరకు వలస కార్మికుల ఆచూకీ గల్లంతైంది. ఇక్కడ కొండచరియలు విరిగిపడి చాలామంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ముండకై ప్రాంతంలోని తేయాకు, కాఫీ తోటలలో పని చేసేందుకు పశ్చిమ బెంగాల్, అసోం రాష్ట్రాల నుంచి వచ్చిన వందలాది మంది కార్మికులు కనిపించకుండా పోయారు.

స్థానికంగా మొబైల్ ఫోన్ నెట్ వర్క్ కూడా పని చేయడం లేదు. ముండకై ప్రాంతంలోని హారిసన్ మలయాళి ప్లాంటేషన్ లిమిటెడ్‌లో పని చేసేందుకు వీరంతా వచ్చారు. వీరు ముండకైలోనే ఉంటున్నారు.

మలయాళి ప్లాంటేషన్ లిమిటెడ్ కంపెనీ జనరల్ మేనేజర్ బెనిల్ జోన్స్ మాట్లాడుతూ… తమ తోటల్లో పని చేయడానికి వచ్చిన కార్మికులను ఇప్పటి వరకు సంప్రదించలేకపోయామన్నారు. ఇక్కడ మొబైల్ నెట్ వర్క్ కూడా పని చేయడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక్కడి నాలుగు వీధుల్లో అసోం, బెంగాల్ నుంచి వచ్చిన 65 కుటుంబాలవారు నివాసం ఉంటున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఇదే ప్రాంతంలో కొండచరియలు విరిగిపడ్డాయి. మొత్తం ఇళ్లు ధ్వంసమైనట్లుగా చెబుతున్నారు. 

రెండు రోజులపాటు సంతాపదినాలు 

వాయనాడ్ తీవ్ర విషాదం నేపథ్యంలో మంగళవారం, బుధవారం సంతాప దినాలుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఇప్పటి వరకు 70 మందికి పైగా మృతి చెందారు. ఈ నేపథ్యంలో రెండు రోజులు సంతాప దినాలు ప్రకటించినట్లు అధికారులు తెలిపారు.

నదిలో తేలియాడిన మృతదేహాలు

మలప్పురం చలియార్ నదిలో చాలా మృతదేహాలు తేలియాడుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. కొండచరియలు విరిగినపడిన స్థలానికి కొన్ని కిలో మీటర్ల దూరంలో 11 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో చాలా వాటికి శరీర భాగాల్లేవు. మూడేళ్ల పాప మృతదేహం కొట్టుకు వచ్చింది. ఇది అక్కడి వారిని అందరినీ కలచివేసింది. 

80 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నాం

ఆర్మీ సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, ఇప్పటి వరకు 80 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని కేరళ చీఫ్ సెక్రటరీ వి వేణు తెలిపారు. ఈ ఘటనలో 116 మంది వరకు గాయపడ్డారని, వారికి ఆసుపత్రులలో చికిత్స అందిస్తున్నామని అధికారులు తెలిపారు. కేరళకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ రూ.5 కోట్ల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *