తిరుపతి నగరంలో మళ్లీ చిరుత సంచారం భయాందోళన రేపుతోంది. ఎస్వీ యూనివర్సిటీ పాపులేషన్ స్టడీస్ ఐ బ్లాక్ పరిసరాల్లో చిరుత సంచరించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి.
ఈ ఘటనలో ఓ కుక్కపై చిరుత దాడి చేసినట్లు వీడియోలో కనిపించింది. కుక్క పెద్దగా అరుస్తూ దాన్ని తరిమేందుకు ప్రయత్నించగా, చిరుత రివర్స్ ఎటాక్ చేసి కుక్కను వెంటాడింది.
ALSO READ:జమ్మూకాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్: కేరన్ సెక్టార్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతం
చిరుత కదలికలతో వర్సిటీ ప్రాంగణం మొత్తం అలర్ట్ మోడ్‌లోకి వెళ్లింది. విద్యార్థులు, సిబ్బంది, అలాగే క్యాంపస్‌లో నివసించే స్థానికులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ముఖ్యంగా రాత్రి డ్యూటీలో ఉండేవారు బిల్డింగ్‌ల నుంచి బయటకు రాకముందు చప్పుళ్లు చేస్తూ రావాలని సూచించారు.
ఇది మొదటి ఘటన కాదు. కొద్దిరోజుల క్రితం మంగళం రోడ్డులోని భూపాల్ హౌసింగ్ కాలనీలో కూడా ఓ ఇంటి ముందు ఉన్న కుక్కపై చిరుత దాడి చేసింది. అదనంగా, ఇటీవల శ్రీవారి మెట్టు మార్గంలోనూ భక్తులకు చిరుత కనిపించిన ఘటన గుర్తుండే ఉంది.
చిరుత సంచారం పెరుగుతున్న నేపథ్యంలో తిరుపతి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వన్యప్రాణి శాఖ అధికారులు ప్రస్తుతం యూనివర్సిటీ పరిసరాల్లో పహారా ముమ్మరం చేశారు.
