ప్రమాదాల నివారణకు ఆర్టీసీ కొత్త చర్యలు – డ్రైవర్లకు సిమ్యులేటర్‌ శిక్షణ ప్రారంభం

ఆర్టీసీ డ్రైవర్‌ సిమ్యులేటర్‌ శిక్షణలో పాల్గొంటున్న దృశ్యం

HYD: చిన్న తప్పిదం కూడా ప్రాణాంతకమవుతుందనే చేవెళ్ల రోడ్డు ప్రమాదం మరోసారి నిరూపించింది. టిప్పర్‌ డ్రైవర్‌ తప్పిదం కారణంగా ఆర్టీసీ బస్సు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోవడంతో, డ్రైవింగ్‌ భద్రతపై ఆర్టీసీ అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది.

ఇకనుంచి డ్రైవర్ల సామర్థ్యాన్ని పెంపొందించి ప్రమాదాలను తగ్గించేందుకు ఆర్టీసీ ఆధునిక సిమ్యులేటర్‌ ట్రైనింగ్‌ సిస్టమ్‌ను ప్రారంభించనుంది. 

ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి ఈ మేరకు అధికారులను ఆదేశించారు. రెండు అధునాతన సిమ్యులేటర్లు కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

డిసెంబరు చివరి వారంలోగా వరంగల్‌, కరీంనగర్‌, హైదరాబాద్‌లలో ఏ రెండు కేంద్రాల్లోనైనా ఇవి ఏర్పాటు కానున్నాయి. ఒక్కో సిమ్యులేటర్‌ ఖరీదు రూ.40 నుండి రూ.50 లక్షలు ఉండనుంది.

ALSO READ:వరంగల్‌లో మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్‌ సూరీ గ్యాంగ్‌ అరెస్ట్‌

సిమ్యులేటర్‌ ద్వారా శిక్షణ ఎలా ఇస్తారు?

సిమ్యులేటర్‌ పూర్తిగా ఒక బస్సు మాదిరిగా రూపొందించబడుతుంది — ఇందులో డ్రైవర్‌ సీటు, స్టీరింగ్‌, గేరు, క్లచ్‌, బ్రేకులు ఉంటాయి. పెద్ద తెరపై వాస్తవ రోడ్డు పరిస్థితులను చూపిస్తారు. డ్రైవర్‌ సిమ్యులేటర్‌పై డ్రైవ్‌ చేయగా, తెరపై వాహనాలు, ట్రాఫిక్‌, రోడ్డు పరిస్థితులు కనిపిస్తాయి.

పరీక్షలో భాగంగా అకస్మాత్తుగా వర్షం, చీకటి, వాహనాల అడ్డుపడటం, ప్రమాదకర మలుపులు, గట్టిగా బ్రేక్‌ వేయాల్సిన పరిస్థితులు సృష్టిస్తారు. డ్రైవర్‌ ఆ పరిస్థితుల్లో ఎలా స్పందిస్తాడో రికార్డు చేస్తారు. ఆ తర్వాత చేసిన తప్పిదాలను విశ్లేషించి తగిన సూచనలు, అదనపు శిక్షణ అందిస్తారు.

  ప్రమాదాలపై కట్టడి చర్యలు

ఇప్పటికే ఎక్కువ ప్రమాదాల్లో పాల్గొన్న డ్రైవర్లకు హకీంపేట్‌ ట్రైనింగ్‌ సెంటర్‌లో ప్రత్యేక శిక్షణ తరగతులు  నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. సిమ్యులేటర్‌ ట్రైనింగ్‌తో డ్రైవర్లు అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలో, ప్రమాదాలను ఎలా నివారించాలో నేర్చుకునే అవకాశం ఉంటుందని ఆర్టీసీ ఆశాభావం వ్యక్తం చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *