పల్నాడు జిల్లా:నరసరావుపేట కోటసెంటర్‌లోని ప్రముఖ”స్వాతి షాపింగ్ మాల్‌లో” తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో సుమారు “₹5 కోట్ల విలువైన వస్త్రాలు అగ్నికి ఆహుతి” అయినట్లు అంచనా. మాల్ మొత్తం నాలుగు ఫ్లోర్‌లను మంటలు చుట్టుముట్టడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

ప్రాథమిక సమాచారం ప్రకారం, మాల్ రెండవ ఫ్లోర్‌లో పొగలు కమ్ముకోవడంతో వెంటనే సిబ్బందిని సెల్లార్‌కి తరలించిన యాజమాన్యం చర్య తీసుకుంది. అయితే, అక్కడ గాలివీడుపు లేకపోవడంతో ఒక మహిళా సిబ్బంది సొమ్మసిల్లి పడిపోయినట్లు సమాచారం. ప్రస్తుతం ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించారు.
ALSO READ:ట్రంప్:ప్రపంచాన్ని 150 సార్లు పేల్చగల శక్తి అణు సామర్థ్యం మా దగ్గర ఉంది
ఫైర్ సిబ్బంది మూడు ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే, మాల్‌లో ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించకపోవడం వల్ల మంటలు వేగంగా వ్యాపించాయని అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు జరపాలని ఆదేశాలు జారీ అయ్యాయి.

స్థానిక ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. మీడియా ప్రతినిధులు ఘటనను చిత్రీకరించడానికి ప్రయత్నించగా, మాల్ సిబ్బంది వారిని అడ్డుకోవడం వివాదాస్పదంగా మారింది. ఈ ఘటనపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
