చెయ్యేరు గున్నేపల్లి గ్రామానికి చెందిన ఆదిలక్ష్మి జీవితంలో విషాదాలు వరసగా వచ్చాయి. భర్తను కోల్పోయిన కొద్దికాలానికే ఆమె కుమారుడు కూడా మరణించడంతో కుటుంబ భారమంతా ఆమెపై, ఆమె కోడలు శ్రీదేవిపై పడ్డది.
వికలాంగురాలైన అత్త ఆదిలక్ష్మిని అండగా నిలబెట్టి, శ్రీదేవి తన పిల్లల సంరక్షణతో పాటు కుటుంబాన్ని ధైర్యంగా నెట్టుకొచ్చింది.
మగతోడు లేకుండా కుటుంబాన్ని నడిపిన శ్రీదేవి, నవంబర్ 2న అత్త ఆదిలక్ష్మి ఆకస్మిక మరణంతో తీవ్రంగా కుంగిపోయింది.

అయినప్పటికీ తాను తల్లిలా భావించిన అత్తకు తలకొరివి పెట్టి చివరి సంస్కారాలను స్వయంగా నిర్వహించింది. పాడెను మోసి, చితికి నిప్పు పెట్టిన శ్రీదేవి ధైర్యం అందరినీ కదిలించింది.
తల్లిదండ్రులను సరిగా పట్టించుకోని కొడుకులు ఉన్న ఈ కాలంలో, అత్తను అమ్మలా చూసుకున్న శ్రీదేవి చూపిన మమకారం గ్రామస్థుల హృదయాలను హత్తుకుంది. ఆమె త్యాగం, ప్రేమ, మానవత్వం అందరికీ ఆదర్శంగా నిలిచిందని స్థానికులు ప్రశంసిస్తున్నారు.
