శ్రీకాకుళం జిల్లాలో మొంథా తుఫాన్ ప్రభావంతో రైతులు ఎదుర్కొన్న పంటనష్టంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పంటనష్టం నమోదుకు గడువు మరో రెండు రోజులు పొడిగించినట్లు వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారు.
ఈ మేరకు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ-క్రాప్ నమోదు వందశాతం పూర్తయిందని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. తుఫాన్ వల్ల నష్టపోయిన ప్రతి రైతుకు ప్రభుత్వం నుంచి పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
అయితే మాజీ ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి ఈ-క్రాప్ నమోదు జరగలేదని చేస్తున్న ఆరోపణలు పచ్చి అబద్ధాలని మంత్రి తీవ్రంగా విమర్శించారు.
“జగన్‌కి నచ్చిన ఏ ప్రాంతానికైనా రావచ్చు, నేనూ వస్తా. ఈ-క్రాప్ నమోదు పూర్తయిందని నిరూపిస్తా,” అంటూ అచ్చెన్నాయుడు సవాల్ విసిరారు.
శ్రీకాకుళం జిల్లా సమీక్ష మండలి సమావేశంలో మాట్లాడిన ఆయనతో పాటు జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి కొండపల్లి శ్రీనివాస్, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.
