ఓట్ల దొంగతనం ఆరోపణలపై స్పందించిన ఈసీ హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని కాంగ్రెస్ ఎంపీ, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలకు ఎన్నికల సంఘం స్పందించింది.
రాహుల్ గాంధీ మీడియా సమావేశంలో ఓట్ల దొంగతనం జరిగిందని పేర్కొన్నారు. దీనిపై ఈసీ స్పష్టత ఇస్తూ, ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఎటువంటి అప్పీళ్లు లేదా అభ్యంతరాలు నమోదు చేయలేదని తెలిపింది.
హర్యానా 90 స్థానాలకు సంబంధించిన ఎన్నికల్లో ప్రస్తుతం కేవలం 22 పిటిషన్లు మాత్రమే హైకోర్టులో పెండింగ్లో ఉన్నాయని కమిషన్ వెల్లడించింది.
నిబంధనల ప్రకారం, ఓటర్ల జాబితా లేదా ఎన్నికల ప్రక్రియలో వ్యత్యాసం ఉంటే పార్టీలు అప్పీల్ చేయవచ్చని, కానీ కాంగ్రెస్ దానిని చేయలేదని ఈసీ పేర్కొంది.
పోలింగ్ కేంద్రాల్లో కాంగ్రెస్ ఏజెంట్లు అప్పట్లో అభ్యంతరాలు లేవనెత్తి ఉంటే సమస్యలు తక్షణమే పరిష్కరించవచ్చని తెలిపింది.
నకిలీ ఓటర్ల అంశంపై కూడా ఈసీ స్పందిస్తూ, “బహుళ పేర్లు ఉన్నాయని తెలిసినా కాంగ్రెస్ BLA సవరణ సమయంలో ఎటువంటి అభ్యంతరాలు తెలిపింది?” అని ప్రశ్నించింది.
ఇక బీజేపీ తరఫున కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు రాహుల్ గాంధీపై విరుచుకుపడ్డారు. “తన వైఫల్యాలను దాచుకునేందుకు రాహుల్ గాంధీ మీడియా ముందు అర్ధంలేని వ్యాఖ్యలు చేస్తున్నారు.
యువతను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు” అని రిజిజు విమర్శించారు. బీహార్ ఎన్నికల ముందు దృష్టి మళ్లించేందుకు హర్యానా గురించి కల్పిత కథలు చెబుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
