బొత్స సత్యనారాయణ ఫైర్‌: పంట నష్టాలపై ప్రభుత్వం లెక్కలు చెప్పాలి

YSRCP MLC Botsa Satyanarayana criticizes Andhra Pradesh government over crop loss and Kashi Bugga incident

మొంథా తుఫాన్‌ కారణంగా రాష్ట్రవ్యాప్తంగా రైతులు భారీ నష్టాలను ఎదుర్కొన్నప్పటికీ, ప్రభుత్వం ఇప్పటికీ పంట నష్టాలపై సమగ్రమైన లెక్కలను విడుదల చేయలేదని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ తీవ్ర విమర్శలు గుప్పించారు.

24 జిల్లాల్లో రైతులు నష్టపోయినా, ముఖ్యమంత్రి, మంత్రులు మాటలకే పరిమితం అయ్యారని ఆయన విమర్శించారు.

గత 18 నెలల్లో వర్షాలు, కరువు కారణంగా నష్టపోయిన మండలాల వారీగా పరిహారం వివరాలను ప్రభుత్వం బహిర్గతం చేయాలని బొత్స డిమాండ్ చేశారు. “పంట నష్టంపై ప్రభుత్వం పూర్తి స్థాయి ప్రకటన చేయడం లేదు.

ఇన్సూరెన్స్ లను ప్రభుత్వం చెల్లించి ఉంటే రైతులు నష్టపోయేవారు కాదు. ఈ క్రాప్ విధానాన్ని రద్దు చేసి రైతులపై భారం మోపడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు” అని ఆయన అన్నారు.

వైసీపీ హయాంలో రైతులను ఆదుకున్నాం 

వైసీపీ హయాంలో రైతుల తరపున ఇన్సూరెన్స్ మొత్తాన్ని ప్రభుత్వం చెల్లించిందని, 7 వేల కోట్లను మద్దతు ధర రూపంలో ఇచ్చామని గుర్తు చేశారు. “ప్రస్తుత ప్రభుత్వం ఆ విధానాన్ని కొనసాగించిందా?” అని ప్రశ్నించారు బొత్స.

కాశీబుగ్గ ఘటనపై ప్రభుత్వ వైఖరిని కూడా ఆయన తీవ్రంగా విమర్శించారు. “ప్రైవేట్ దేవాలయం అని చెప్పి బాధ్యత తప్పించుకోవడం సరికాదు. తిరుపతి, సింహాచలం ఘటనలలో జరిగిన నష్టం, దర్యాప్తు నుంచి మీరు నేర్చుకున్నది ఏమిటి? ప్రజల పట్ల మీ బాధ్యత ఎక్కడ?” అని ఆయన నిలదీశారు.

అక్రమ మద్యం కేసులో జోగి రమేష్‌పై వచ్చిన ఆరోపణలపై స్పందిస్తూ, “నాకు ఆ వ్యవహారంలో ఎలాంటి సంబంధం లేదు. కొంత మీడియా వర్గం కట్టుకథలు సృష్టిస్తోంది” అని చెప్పారు.

వైజాగ్ డ్రగ్స్ కేసుపై మూడు సార్లు స్పందించానని, సీబీఐ, హోంశాఖలకు లేఖలు రాశానని తెలిపారు.

ప్రభుత్వ వైఫల్యాలు బహిర్గతం అయిన ప్రతిసారి ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తుందని ఆరోపించిన బొత్స, “ప్రజా సమస్యలపై చర్య తీసుకోవడమే ప్రభుత్వ భక్తి. కానీ ఈ ప్రభుత్వం మాటలతో తప్పించి బాధ్యత నుంచి తప్పించుకుంటోంది” అని తీవ్రంగా విమర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *