శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలం బందపల్లి బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలలో సంచలనాత్మక ఘటన చోటుచేసుకుంది. విద్యార్థినులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన లేడీ టీచర్ వారినే కాళ్లు పట్టించుకోవడం సామాజిక వర్గాల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేపింది.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి,సదరు ఉపాధ్యాయురాలు సుజాతను తక్షణం సస్పెండ్ చేసింది.సుజాత ఆ పాఠశాలలో హెడ్‌మిస్ట్రెస్‌గా (హెచ్‌ఎం) పనిచేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
వైరల్ వీడియోలో ఆమె కుర్చీలో కూర్చుని మొబైల్ ఫోన్‌లో మాట్లాడుతూ ఉండగా, ఆమె ముందు ఇద్దరు విద్యార్థినులు నేలపై మోకాళ్లపై కూర్చుని ఆమె కాళ్లు నొక్కుతున్న దృశ్యాలు స్పష్టంగా కనిపించాయి.
ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చెందడంతో ప్రజలు, తల్లిదండ్రులు, విద్యా కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.విద్యా వ్యవస్థ పరువుని దెబ్బతీసే ఈ ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని అందరూ డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విచారణకు ఆదేశాలు జారీ చేసి, విద్యాశాఖ అధికారి ఆధ్వర్యంలో పూర్తి నివేదిక సమర్పించాలంటూ సూచనలు ఇచ్చింది.
ఈ ఘటన విద్యారంగంలో క్రమశిక్షణా లోపాలపై మరోసారి చర్చకు దారితీసింది.
