అమెరికాలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుని భారీ ప్రాణనష్టం సంభవించింది. కెంటకీ రాష్ట్రంలోని లూయిస్‌విల్లే ఎయిర్‌పోర్టులో యూపీఎస్ (UPS) కార్గో విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలిపోయింది. ప్రమాదం జరిగిన వెంటనే విమానం పేలిపోవడంతో భారీ ఎత్తున మంటలు చెలరేగాయి.
ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలతో కమ్ముకున్నది. ప్రమాద తీవ్రతతో సమీపంలోని పలు భవనాలు దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో విమానంలోని ముగ్గురు సిబ్బంది అక్కడికక్కడే మృతి చెందగా,మరో 11 మంది గాయపడ్డారు.
ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఆ యూపీఎస్ కార్గో విమానం సుమారు 42 వేల గ్యాలన్ల జెట్ ఇంధనాన్ని మోసుకెళ్తోందని,ఇది ప్రమాద తీవ్రతను మరింత పెంచిందని పేర్కొన్నారు.
ఇంధన పేలుడు కారణంగా భారీగా నష్టం సంభవించినట్లు సమాచారం. ప్రస్తుతం అధికారులు ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు ప్రారంభించారు.

ప్రమాద సమయంలో విమానం టేకాఫ్ తర్వాత కొద్ది నిమిషాలకే రన్‌వే సమీపంలోని భవనాలపై కూలిపోయిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.భారీ మంటలతో సహాయక చర్యలు కష్టతరంగా మారగా, రక్షణ బృందాలు నిరంతరాయంగా శ్రమిస్తున్నాయి. స్థానిక అధికారులు మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని హెచ్చరించారు.
