‘మొంథా’ తుపాను రాష్ట్రం వైపు వేగంగా కదులుతున్న నేపథ్యంలో, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. తుపాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో ఆయన టెలీకాన్ఫరెన్స్ ద్వారా పరిస్థితిని సమీక్షించారు. ప్రజల ప్రాణనష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, సహాయక చర్యల్లో ఎలాంటి లోపం ఉండకూడదని ఆయన ఆదేశించారు.
ముఖ్యమంత్రి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తుపాను ప్రభావంతో పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందే ప్రతి కుటుంబానికి తక్షణ సాయంగా రూ.3,000 అందించాలని ఆయన ఆదేశించారు. అదనంగా ప్రతి కుటుంబానికి 25 కిలోల బియ్యం, అవసరమైన నిత్యావసర వస్తువులను కూడా పంపిణీ చేయాలని సూచించారు.
పునరావాస కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్, మరుగుదొడ్లు, ఆహార సరఫరా వంటి మౌలిక సదుపాయాలు పుష్కలంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అంతేకాదు, ప్రతి పునరావాస కేంద్రంలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజల ఆరోగ్యాన్ని పర్యవేక్షించాలని సూచించారు. అత్యవసర వైద్య సేవలు అందించే సిబ్బంది 24 గంటలూ అందుబాటులో ఉండాలని ఆయన స్పష్టం చేశారు.
చంద్రబాబు మాట్లాడుతూ, “ప్రస్తుతం చేపడుతున్న తుపాను సహాయక చర్యలు భవిష్యత్తులో రాష్ట్రం ఎదుర్కొనే ప్రకృతి విపత్తులకు ఆదర్శంగా నిలవాలి” అని పేర్కొన్నారు. అధికార యంత్రాంగం సమన్వయంతో పనిచేస్తే ప్రజల ప్రాణ, ఆస్తి నష్టం పూర్తిగా నివారించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
సమావేశంలో తుపాను దిశ, వర్షపాతం అంచనాలు, తీరప్రాంతాల ఖాళీ ప్రణాళికలు, విద్యుత్ పునరుద్ధరణ చర్యలు వంటి అంశాలపై కూడా సమగ్ర చర్చ జరిగింది. జిల్లాల వారీగా రిస్క్ ప్రాంతాలను గుర్తించి ముందస్తు చర్యలు చేపట్టాలని సీఎం స్పష్టం చేశారు
