దక్షిణ చైనా సముద్రంలో అమెరికా నౌకాదళానికి షాక్ ఇచ్చే ఘటనలు చోటుచేసుకున్నాయి. యూఎస్ పసిఫిక్ ఫ్లీట్ పరిధిలో ఉన్న యూఎస్ఎస్ నిమిట్జ్ అనే ప్రపంచ ప్రసిద్ధ విమాన వాహక నౌక నుంచి బయలుదేరిన రెండు యుద్ధ విమానాలు అరగంట వ్యవధిలోనే సముద్రంలో కూలిపోయాయి. వరుస ప్రమాదాలతో నౌకాదళంలో కలకలం రేగింది.
వివరాల ప్రకారం, యూఎస్ఎస్ నిమిట్జ్ నుంచి రొటీన్ ఆపరేషన్లలో భాగంగా గాల్లోకి లేచిన ఎంహెచ్-60ఆర్ సీహాక్ హెలికాప్టర్ అకస్మాత్తుగా సాంకేతిక లోపం తలెత్తడంతో సముద్రంలో కూలిపోయింది. హెలికాప్టర్‌లో ముగ్గురు సిబ్బంది ఉండగా, వారు సమయానికి ప్యారషూట్ల సహాయంతో బయటపడగలిగారు. ఈ ఘటనకు 30 నిమిషాలకే మరో షాక్ ఎదురైంది. అదే నౌక నుంచి బయలుదేరిన బోయింగ్ ఎఫ్/ఏ-18ఎఫ్ సూపర్ హార్నెట్ ఫైటర్ జెట్ కూడా గాల్లో తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగా సముద్రంలో కుప్పకూలింది.
సమాచారం అందుకున్న వెంటనే యూఎస్ఎస్ నిమిట్జ్‌పై ఉన్న రక్షణ బృందాలు చురుగ్గా స్పందించి, హెలికాప్టర్‌లోని ముగ్గురిని, జెట్‌లోని ఇద్దరు పైలట్లను సురక్షితంగా రక్షించాయి. సిబ్బంది ప్రాణాలతో బయటపడటం తాత్కాలిక ఉపశమనం కలిగించినా, రెండు అత్యాధునిక యుద్ధ విమానాలను కోల్పోవడం అమెరికా నేవీకి పెద్ద నష్టం అని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
పసిఫిక్ ఫ్లీట్ కమాండ్ ఈ ఘటనలపై దర్యాప్తు ఆదేశించింది. ప్రాథమిక సమాచారం ప్రకారం, రెండు యంత్రాలూ సాధారణ ఆపరేషన్లలో ఉన్నప్పటికీ సాంకేతిక లోపాలు కారణంగా ప్రమాదాలు జరిగి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో అమెరికా, చైనా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో ఈ ఘటన జరగడం గమనార్హం.
యూఎస్ఎస్ నిమిట్జ్ (CVN-68) అమెరికా నౌకాదళానికి చెందిన అత్యంత శక్తివంతమైన విమాన వాహక నౌకల్లో ఒకటి. ప్రస్తుతం ఇది దక్షిణ చైనా సముద్రంలో పహారా విధుల్లో ఉండగా ఈ ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. దీనివల్ల అమెరికా సైనిక సామర్థ్యాలపై చర్చ మొదలైంది.
